IPL 2023: తొలి మ్యాచ్ గెలిచిన గుజరాత్‌కు షాక్.. సీజన్ మొత్తానికి కీలక ఆటగాడు దూరం!
ABN , First Publish Date - 2023-04-01T16:45:30+05:30 IST
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) ఐపీఎల్ ఆడడం అనుమానంగా మారింది
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) ఐపీఎల్ ఆడడం అనుమానంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేన్ కుడి మోకాలికి గాయమైంది. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో 32 ఏళ్ల విలియమ్సన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎంతన్నది తెలియనప్పటికీ తీవ్రత అయితే మాత్రం చిన్నది కాదని తెలుస్తోంది. రుతురాజ్ కొట్టిన బంతి బౌండరీ లైన్‌కు ఆవలపడబోతున్న సమయంలో ఒంటి చేత్తో దానిని పట్టుకుని గాల్లో నుంచి మైదానంలోకి విసిరేశాడు. ఈ క్రమంలో కిందపడడంతో కుడికాలి మోకాలికి గాయమైంది.
ట్రీట్‌మెంట్ తర్వాత కేన్ మైదానాన్ని వీడాడు. దీంతో అతడి స్థానంలో బి.సాయిసుదర్శన్(B.Sai Sudharsan) తొలుత సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. ఆ తర్వాత విలియమ్సన్ బ్యాటింగ్‌కు కూడా రాకపోవడంతో ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player)గా విలియమ్సన్ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. విలియమ్సన్ గాయాన్ని వైద్యులు అంచనా వేస్తున్నారని, ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు తక్కువేనని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
మ్యాచ్ అనంతరం టైటాన్స్ కెప్టెన్ పాండ్యా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేన్ గాయం తీవ్రత గురించి తనకు పూర్తిగా తెలియదని పేర్కొన్నాడు. మోకాలికి గాయమైందన్న విషయం తెలుసు కానీ, ఏం జరిగిందన్న విషయం స్పష్టంగా తనకు తెలియదని అన్నాడు. గాయం తీవ్రత ఎంతో, తగ్గేందుకు ఎంత సమయం పడుతుందో కూడా తనకు తెలియదని స్పష్టం చేశాడు.
ఒకవేళ విలియమ్సన్ ఈ సీజన్‌కు దూరమైతే ప్రస్తుతం కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith)ను టైటాన్స్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే, శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక(Dasun Shanaka) పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో వీరిద్దరూ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
విలియమన్సన్ 2015 నుంచి సన్‌రైజర్స్ హైదరాబద్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. 2018, 2022లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2019, 2021లో పాక్షింగా కెప్టెన్‌గా చేశాడు.