IPL MS Dhoni: క్రికెట్ ఫ్యాన్స్‌ను మెప్పించే రికార్డుకు చేరువలో ఎంఎస్ ధోనీ.. ఈ రోజే రికార్డ్ సృష్టించే అవకాశం
ABN , First Publish Date - 2023-03-31T17:09:29+05:30 IST
మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni).. క్రికెట్‌లో ఆ పేరే ఒక వైబ్రేషన్. టీమిండియా(Team India) విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా
అహ్మదాబాద్: మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni).. క్రికెట్‌లో ఆ పేరే ఒక వైబ్రేషన్. టీమిండియా(Team India) విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ఘనత సాధించిన ఈ మాజీ క్రికెటర్ తన పేరున లెక్కనేనన్ని రికార్డులు రాసుకున్నాడు. ఐపీఎల్ (IPL 2023)లోనూ అతడికి ఘనతమైన చరిత్ర ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chenni Super Kings) కెప్టెన్‌గానూ జట్టుకు టైటిళ్లు అందించి పెట్టాడు. నేడు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో మరో రికార్డును కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ఆడుతున్న ధోనీ 5 వేల పరుగులకు చేరువగా ఉన్నాడు. ప్రస్తుతం 4,978 పరుగులతో ఉన్న ధోనీ మరో 22 పరుగులు సాధిస్తే ఐపీఎల్‌లో 5 వేల పరుగులు సాధించిన ఏడో క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు.
ఈ జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) 6624 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ధోనీ ఫిట్‌నెస్‌పై ఆందోళన
గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ ఫిట్‌నెస్‌పై కొంత ఆందోళన నెలకొంది. ప్రాక్టీస్ సెషన్‌లో స్వల్ప గాయం కావడంతో నేటి మ్యాచ్‌లో ధోనీ ఆడతాడో, లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అందోళన చెందాల్సిన పనిలేదని, అది చిన్న గాయమేనని, ఆరంభ మ్యాచ్‌లో ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్ స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.