Asia Cup 2023: పసికూనపై సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. పాకిస్థాన్ భారీ స్కోరు
ABN , First Publish Date - 2023-08-30T19:01:15+05:30 IST
ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.
ఆసియా కప్ 2023లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై పాకిస్థాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (5), ఫకార్ జమాన్ (14) తక్కువ స్కోరు అవుటై పెవిలియన్ చేరారు. కానీ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. మూడో వికెట్‌కు కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో కలిసి 96 పరుగులు జోడించాడు. 111 పరుగుల స్కోరు వద్ద రనౌట్‌గా వెనుతిరిగాడు.
ఇది కూడా చదవండి: Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం
రిజ్వాన్ అవుటైన తర్వాత పాకిస్థాన్ వెంటనే మరో వికెట్ కోల్పోయింది. సల్మాన్ (5) కూడా తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. అయితే ఆ తర్వాత పాకిస్థాన్ ఇన్నింగ్స్ వాయువేగంతో దూసుకెళ్లింది. దీనికి కారణం ఆ జట్టు బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్. అతడు రావడంతోనే బౌండరీలతో నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 71 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా అతడి అండతో రెచ్చిపోయాడు. 131 బాల్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో బాబర్‌కు ఇది 19వ సెంచరీ కావడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. తాజా సెంచరీతో అతడి బ్యాటింగ్ సగటు 60కి పైగా నమోదు కావడం విశేషం. నేపాల్ బౌలర్లలో సోంపాల్‌కు రెండు వికెట్లు దక్కగా.. కరన్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో నేపాల్ గెలవాలంటే 343 పరుగులు సాధించాలి.