Suryakumar Yadav: సూర్య ఖాతాలో సంచలన రికార్డ్!

ABN , First Publish Date - 2023-01-08T16:01:46+05:30 IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి శ్రీలంక(Sri Lanka)తో జరిగిన చివరి మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు

Suryakumar Yadav: సూర్య ఖాతాలో సంచలన రికార్డ్!

రాజ్‌కోట్: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి శ్రీలంక(Sri Lanka)తో జరిగిన చివరి మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు (Team India) 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. యథేచ్ఛగా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలో 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ టీ20ల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు, పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన రెండో ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో టీమిండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) అగ్రస్థానంలో ఉన్నాడు. 2017లో ఇదే ప్రత్యర్థి (శ్రీలంక)తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఇప్పుడు సూర్యకుమార్ 45 బంతుల్లో ఆ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో సూర్య మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఇదొక్కటే కాదు, సూర్యకుమార్ ఖాతాలో మరో అత్యంత అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది. ఓపెనర్‌గా కాకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో మధ్యలో దిగి మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా సూర్యకుమార్ చరిత్ర సృష్టించాడు. గతేడాది నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌(England)తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యకుమార్.. మౌంట్ మాంగనూయిలో న్యూజిలాండ్‌(New Zealand)తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో శతకం చేశాడు.

Updated Date - 2023-01-08T16:02:24+05:30 IST