Share News

World Cup: పసికూన అఫ్ఘానిస్థాన్ సెమీస్ చేరుతుందా?.. అందుకున్న దారులివే..

ABN , First Publish Date - 2023-11-01T12:43:07+05:30 IST

భారత్ వేదికా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పసికూనగా టోర్నీలోకి అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ జట్టు బలమైన జట్లను ఓడిస్తూ అందరి దృష్టిని తమ వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలకు అందకుండా సెమీస్ రేసులో నిలిచింది.

World Cup: పసికూన అఫ్ఘానిస్థాన్ సెమీస్ చేరుతుందా?.. అందుకున్న దారులివే..

భారత్ వేదికా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పసికూనగా టోర్నీలోకి అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ జట్టు బలమైన జట్లను ఓడిస్తూ అందరి దృష్టిని తమ వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలకు అందకుండా సెమీస్ రేసులో నిలిచింది. గత ప్రపంచకప్‌లో ఒక విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన అప్ఘానిస్థాన్ జట్టు ఈ సారి 3 విజయాలు సాధించింది. అది కూడా ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లపై కావడం గమనార్హం. దీంతో అప్ఘాన్ జట్టు ప్రస్తుతం సెమీస్ రేసులో ఉంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన అఫ్ఘానిస్థాన్ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో ఆ జట్టుకు సెమీస్ చేరేందుకు మంచి అవకాశాలున్నాయి.


అఫ్ఘానిస్థాన్ సెమీస్ చేరేందుకు ఉన్న దారులను ఒకసారి పరిశీలిస్తే.. ఆ జట్టు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో తలపడనుంది. అఫ్ఘాన్ జట్టు ఈ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా అప్ఘానిస్థాన్ జట్టు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న ఆస్ట్రేలియాను ఓడిస్తుంది. ఆస్ట్రేలియా కూడా ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 4 విజయాలతో 8 పాయింట్లున్నాయి. ఓ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ చేతిలో ఓడి మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆసీస్ ఖాతాలో 12 పాయింట్లుంటాయి. అఫ్ఘాన్ మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు ఖాతాలో కూడా 12 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్ రేటు ఉన్న జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుది. ప్రస్తుతం అప్ఘానిస్థాన్ కంటే ఆస్ట్రేలియాకే మెరుగైన రన్ రేటు ఉంది. దీంతో అప్ఘానిస్థాన్ జట్టు రాబోయే మ్యాచ్‌ల్లో విజయాలతోపాటు రన్‌రేటును కూడా మెరుగుపరచుకోవాల్సి ఉంది. లేదంటే అఫ్ఘానిస్థాన్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్టు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఓడిపోవాల్సి ఉంటుంది.

ఒకవేళ పాకిస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, అప్ఘానిస్థాన్ కూడా రెండు మ్యాచ్‌ల్లోనే గెలిస్తే.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్టు ఒక్కో మ్యాచ్ గెలిస్తే.. శ్రీలంక తమకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ ఐదు జట్ల ఖాతాలో పదేసి పాయింట్లు చొప్పున ఉంటాయి. అప్పుడు మెరుగైనా రన్ రేటు ఉన్న రెండు జట్లు మాత్రమే సెమీస్ చేరుతాయి. దీంతో అప్ఘానిస్థాన్ ఇక నుంచి గెలిచే ప్రతి మ్యాచ్ మెరుగైన రన్ రేటుతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అఫ్ఘాన్ జట్టుకు సెమీస్ అవకాశాలు దక్కుతాయి. అలా కాకుండా మిగిలిన 3 మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్ ఒక్కటే గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 4 విజయాలు మాత్రమే ఉంటాయి. దీంతో అప్ఘానిస్థాన్ సెమీస్ రేసుకు దాదాపుగా దూరమైనట్టే. 4 విజయాలతో అఫ్ఘాన్ జట్టు సెమీస్ చేరాంటే ఏదైన అద్భుతం జరగాల్సిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తమకు మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్, శ్రీలంక జట్లు మరో 2 మ్యాచ్‌లకు మించి గెలవడానికి వీల్లేదు. అలా కాకుండా అఫ్ఘానిస్థాన్ జట్టు తమకు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోతే సెమీస్ చేరే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో సెమీస్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్‌లు మంచి రన్ రేటుతో గెలవడం అఫ్ఘానిస్థాన్‌కు ఉత్తమం. అప్పుడు సెమీస్ చేరేందుకు మంచి అవకాశాలుంటాయి. కానీ అది అంత తేలికైనా విషయం ఏం కాదు. ఎందుకంటే అప్ఘానిస్థాన్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో తలపడనుంది. పైగా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్నాయి. అలాగని అఫ్ఘానిస్థాన్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పైగా ఆ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్టను ఓడించింది.

Updated Date - 2023-11-01T12:43:07+05:30 IST