Jayaram: గుండెపోటుతో టీమిండియా మాజీ సెలెక్టర్ కన్నుమూత
ABN , First Publish Date - 2023-07-16T14:36:35+05:30 IST
బీసీసీఐ మాజీ సెలెక్టర్, కేరళ మాజీ క్రికెటర్ కె జయరామ్(67) ఇక లేరు. శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. రంజీల్లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జయరామ్.. ఆ తర్వాత బీసీసీఐ సెలెక్టర్‌గా కూడా పని చేశారు.
బీసీసీఐ మాజీ సెలెక్టర్, కేరళ మాజీ క్రికెటర్ కె జయరామ్(67) ఇక లేరు. శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. రంజీల్లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జయరామ్.. ఆ తర్వాత బీసీసీఐ సెలెక్టర్‌గా కూడా పని చేశారు. టీమిండియా జూనియర్ టీంకు సెలెక్టర్‌గా వ్యవహరించారు. కాగా జయరామ్ మృతిని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అధికారికంగా ప్రకటించారు. కేరళలోని ఎర్నాకులంలో జన్మించిన జయరామ్ దులీప్ ట్రోఫిలో సౌత్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1980ల్లో జాతీయ స్థాయిలో స్టార్ ప్లేయర్‌గా ఎదిగారు. 1986-87 రంజీ ట్రోఫీ సీజన్‌లో కేరళ తరఫున జయరామ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించారు. 1981 నుంచి 1983 వరకు కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన జయరామ్ 29 సగటుతో 2,358 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలున్నాయి. పార్ట్ స్పిన్నర్‌గా 2 వికెట్లు తీశారు. ఒకానొక సమయంలో టీమిండియాలో ఆడడం ఖాయమనిపించినప్పటికీ అదృష్టం కలిసిరాలేదు.
క్రికెట్ నుంచి తప్పుకున్నాక బీసీసీఐలో జయరామ్ విభిన్న పాత్రలను పోషించారు. జూనియర్ స్థాయిలో భారత జట్టుకు సెలెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే కేరళ సీనియర్ జట్లకు చీఫ్ సెలక్టర్‌గా పనిచేశారు. జయరామ్ మ్యాచ్ రిఫరీగా, కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) టాప్ కౌన్సిల్ మెంబర్‌గా కూడా వ్యవహరించారు. కాగా జయరామ్ అంత్యక్రియలు జూలై 17న సోమవారం రావిపురం శ్మశానవాటికలో జరగనున్నాయి. జయరామ్‌కు భార్య రమ, కుమారుడు అభయ్ ఉన్నారు. "ఆ రోజుల్లో కేరళకు క్రికెట్‌లో ఎక్కువ ప్రతిభ లేదు. కానీ జయరామన్ భిన్నంగా ఉండేవారు. అతను చాలా మంచి క్రికెటర్. అతను చాలా స్నేహపూర్వక వ్యక్తి, సెలెక్టర్‌గా తన ప్రతిభను చాటారు. జయరాం మరణం పట్ల అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పేర్కొన్నారు.