Dr. Tellam Venkatarao: ఆఖరున వచ్చి.. అభ్యర్థిగా నిలిచి..
ABN , First Publish Date - 2023-08-22T11:54:44+05:30 IST
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం(Bhadrachalam) అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్
- బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెల్లంకు అవకాశం
- ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
- నాయకులు, అనుచరుల హర్షాతిరేకాలు
భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం): రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం(Bhadrachalam) అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా డా తెల్లం వెంకటరావు(Dr. Tellam Venkatarao) పేరు ఖరారు అవటం పట్ల ఆ పార్టీ నాయకులు, ఆయన అనుచరులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. జూలై రెండున మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ జాతీయ నేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా భద్రాచలం ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య ప్రస్థుతం కొనసాగుతుండటంతో ఈసారి ఎన్నికలలో భద్రాచలం అసెంబ్లీ సీటు కాంగ్రెస్ నుంచి వచ్చే అవకాశం లేకపోవటంతో ఆయన యూటర్న్ తీసుకుని కేవలం 46 రోజులలోనే తిరిగి బీఆర్‌ఎస్ గూటికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. ఈ సమయంలో తనకు భద్రాచలం సీటు కేటాయింపుపై అధిష్టానం భరోసా ఇవ్వటంతో అందరి అంచనాలను తలకిందులను చేస్తూ సోమవారం హైదరాబాద్(Hyderabad)లో సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్ధిగా డా తెల్లం వెంకటరావు పేరును అధికారికంగా ప్రకటించటంతో అందరినోటా అదృష్ట జాతకుడు తెల్లం వెంకటరావు అని అనిపించుకుంటున్నారు.
2018లో సైతం భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్ధి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మరోసారి తన అధృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా తెల్లం వెంకటరావు భద్రాచలం బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) ముందుగానే చెప్పింది. ఈ మేరకు ఈ నెల 20 వ తేదీన భద్రాద్రి సీటుపై తెల్లం వెంకటరావుకు సీఎం భరోసా? అనే కధనాన్ని ప్రచురించింది. అలాగే సీఎం కెసీఆర్‌ను కలవటం తో ఆయన సీటుపై పక్కా హామీ లభించింది. ‘ఆంధ్రజ్యోతి’ ముందుగా చెప్పినట్లుగానే తెల్లం అభ్యర్ధిత్వం ఖరారైంది. ఇదిలా ఉండగా డా తెల్లం వెంకటరావుకు బీఆర్‌ఎస్ భద్రాచలం అసెంబ్లీ అభ్యర్ధిత్వం ఖరారు కావటంతో ఆ పార్టీ నాయకులు,ఆయన అనుచరులలో హర్షాతిరుకం వ్యక్తం అవుతోంది, బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.