KTR: ప్రసంగిస్తూ భయాందోళనకు గురైన మంత్రి కేటీఆర్.. కారణమిదే..!
ABN , First Publish Date - 2023-09-21T15:46:02+05:30 IST
మంత్రి కేటీఆర్ టెన్షన్‌కు గురయ్యారు. ఓ మీటింగ్‌లో ప్రసంగిస్తుండగా సడన్‌గా అలారం మోగడంతో మంత్రి కంగారు పడ్డారు. ఫైర్ అలారమా? వెళ్లిపోదామా? అంటూ
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ టెన్షన్‌కు గురయ్యారు. ఓ మీటింగ్‌లో ప్రసంగిస్తుండగా సడన్‌గా అలారం మోగడంతో మంత్రి కంగారు పడ్డారు. ఫైర్ అలారమా? వెళ్లిపోదామా? అంటూ వ్యాఖ్యానించారు. ఇంతలో స్పీకర్‌లో సౌండ్ వస్తోందని అధికారులు చెప్పగానే కేటీఆర్ కూల్ అయి ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ అనుభవం కేవలం ఒక్క మంత్రి గారికే కాదు.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు భారతదేశమంతా ఇదే పరిస్థితి ఎదురైంది. మొబైల్ స్క్రీన్‌పై ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రాగానే వైబ్రేషన్‌తో శబ్ధం చేసింది. దీంతో మొబైల్ వినియోగదారులంతా హడలెత్తిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. ఇలా ఉదయం నుంచీ ప్రతి ఫోన్‌లోనూ ఇలాంటి శబ్ధాలే వచ్చాయి. అసలు విషయం తెలియక కంగారు పడిపోయారు. సామాన్య ప్రజలతో కూడా మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ అధికారులు మాత్రం స్పీకర్‌లో సౌండ్ వస్తోందని చెప్పగానే ప్రసంగాన్ని కొనసాగించారు. వాస్తవానికి అది స్పీకర్‌లో వచ్చిన సౌండ్ కాదు.. మొబైల్‌లో వచ్చిన శబ్ధం.
అసలు విషయం ఏంటంటే..
టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే అయింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఈ ట్రయల్ టెస్ట్ నిర్వహించారు. ఈ విషయం తెలియక మొబైల్ వినియోగదారులంతా కంగారు పడిపోయారు.
మెసేజ్ ఇలానే వచ్చిందా?
ముఖ్యమైన సమాచారం : మీరు మీ మొబైల్‌లో కొత్త శబ్దం మరియు వైబ్రేషన్‌తో అత్యవసర పరిస్థితి గురించి నమూనా సందేశాన్ని అందుకోవచ్చు. దయచేసి భయపడవద్దు, ఈ సందేశం నిజమైన అత్యవసర పరిస్థితిని సూచించదు. ప్రణాళికాబద్ధమైన ట్రయల్ ప్రాసెస్‌లో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం ద్వారా ఈ సందేశం పంపబడుతోంది.