Union Minister: కేసీఆర్‌ను చేతులు జోడించి వేడుకున్న నిర్మలాసీతారామన్
ABN , First Publish Date - 2023-02-16T19:39:28+05:30 IST
5 ట్రిలియన్‌పై జోకులు వద్దని, కేసీఆర్‌కు కేంద్రమంత్రి నిర్మల చేతులు జోడించి వేడుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM Chandrasekhar Rao)పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ట్రిలియన్‌పై జోకులు వేయవద్దంటూ రెండు చేతులు జోడించి సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు. తెలంగాణకు 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్ విమర్శించారు. తమపై విమర్శలు చేస్తున్నారని, మరి మీ సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. కరీంనగర్, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్ కాలేజీలున్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లో కాలేజీలకే ప్రతిపాదనలు పెట్టారని నిర్మల ఎద్దేవా చేశారు. నెంబర్స్ చూసి విమర్శలు చేస్తే మంచిదని సూచించారు. నో డేటా గవర్నమెంట్ ఎవరిదో ఇప్పుడు అర్థమవుతుందని నిర్మల వ్యాఖ్యానించారు.
కాగా 2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్‌కు చేరుతుందనడం పెద్దజోక్‌గా శాసనసభలో సీఎం కేసీఆర్ (KCR) అభివర్ణించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ అని, మోదీ బడాయిలు పోతున్నారని, వైఫల్యాలను హుందాగా ఒప్పుకోవాలని సీఎం అన్నారు. ఎకనామీగా ఉండటం వేరని, అసలు సంగతి తలసరి ఆదాయం దగ్గర దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంలో 192 దేశాలుంటే అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్‌లో ఇండియాది 139వ స్థానమని, మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ ముందున్నాయని చూపుతూ విమర్శించారు. దీనిపై చర్చ జరగాలన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేస్తే దాన్ని ఇండియాలో బ్యాన్ చేయాలనడం, సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా ప్రపంచమంతా మనగురించి ఏమనుకుంటుందో కొంచెం ఆలోచించాలన్నారు. వ్యతిరేకిస్తే జైలులో పెడతాం, బ్యాన్ చేస్తామంటారా? ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. 2024లో బీజేపీ కుప్పకూలడం ఖాయమని సీఎం జోస్యం చెప్పారు. దేశంలో అంతులేని ప్రైవేటీకరణ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలు, ఎయిర్‌పోర్టులతో పాటు చివరికి భారతదేశ ఆత్మలాంటి ఎల్‌ఐసీని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయవని మోదీ అన్నారని, కానీ అవసరమైతే చేయాల్సిన పరిస్థితులుంటాయని అన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే వాటిలో ఒక్కటీ రాష్ట్రానికి రాకపోవడం అన్యాయం కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రజలూ అడుగుతారని చెప్పారు.
ఈ వార్తలను కూడా చదవండి
**********************************************************
రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్
**************************************************************
ఏ ప్రయోజనాలకీ విరాళాలు.. రాజకీయ పార్టీల మొత్తం విరాళాల్లో 80 శాతం బీజేపీకే!
**************************************************************************