Korutla: కోరుట్లలో ఇలా జరిగిందేంటి.. వర్క్ ఫ్రం హోం చేస్తూ ఉన్న కూతుర్లకు తండ్రి ఫోన్ చేయగా..
ABN , First Publish Date - 2023-08-30T18:04:59+05:30 IST
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీప్తి చెల్లెలు కనిపించకుండా పోవడంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కోరుట్ల: పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీప్తి చెల్లెలు కనిపించకుండా పోవడంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు బస్టాండ్‌లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా మృతురాలి చెల్లెలు మరో వ్యక్తితో వెళ్తున్న వీడియోను పోలీసులు గుర్తించండం చర్చనీయాశంగా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన బంకి శ్రీనివాస్ 30 ఏళ్ల క్రితం కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బకు వచ్చి మేస్త్రీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. శ్రీనివాస్‌కు దీప్తి, చందనతో పాటు కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కుమార్తెలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. శ్రీనివాస్ దంపతులు వారి బంధువుల ఇంట్లో సోమవారం జరిగిన శుభ కార్యానికి వెళ్లారు. ఈ క్రమంలో దీప్తి(24), చందన ఇంటి వద్ద పని చేసుకుంటూ ఉన్నారు. శ్రీనివాస్ మంగళవారం ఉదయం నుంచి కూతుర్లకు ఫోన్ చేశాడు. దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
చందన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటి పక్కవారికి శ్రీనివాస్ ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లి చూడమన్నాడు. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా దీప్తి ముందు రూంలోని సోఫాలో పడి ఉండటాన్ని గమనించి తండ్రి శ్రీనివాస్‌తో పాటు చుట్టు పక్కలవారికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డితో పాటు కోరుట్ల సీఐ ప్రవీణ్, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ పరిశీలించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం సమీపంలోని సీసీ ఫుటేజీలతో పాటు బస్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించగా ఉదయం దీప్తి చెల్లెలు చందన మరో వ్యక్తితో ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న ఓ మద్యం బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. దీప్తి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.