Anti Corruption Bureau : గనుల ఫైళ్లు గల్లంతు
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:35 AM
గనుల శాఖలో దొంగలు పడ్డారు. నాడు జగన్ ప్రభుత్వంలో మైనింగ్ కంపెనీల నుంచి బలవంతంగా వాటాలు తీసుకొని సెటిల్ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందే వాటిని మాయం చేసేశారు.
లేటరైట్, గ్రానైట్, సిలికా, క్వార్ట్జ్‌కు సంబంధించిన 25 ఫైళ్లు మాయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గనుల శాఖలో దొంగలు పడ్డారు. నాడు జగన్ ప్రభుత్వంలో మైనింగ్ కంపెనీల నుంచి బలవంతంగా వాటాలు తీసుకొని సెటిల్ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందే వాటిని మాయం చేసేశారు. తాజాగా ఏసీబీ విచారణ సందర్భంగా ఆ ఫైళ్లు కనిపించడం లేదన్న విషయం వెలుగుచూసింది. దీనివెనుక గ నుల శాఖలో తిష్ఠవేసిన ‘తిమింగలం’ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఆ ఫైళ్లు ఉంటే ఆ అధికారి తెరవెనక చేసిన గనుల పంచాయితీలు, బలవంతపు సెటిల్మెంట్లు, బెదిరింపుల వ్యవహారం బయట పడుతుందని మాయం చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల పరిధిలో విలువైన లేటరైట్ గ్రానైట్, సిలికా, క్వార్ట్జ్ మైనింగ్ చేసే కంపెనీలు జగన్ ప్రభుత్వంలోని ఓ మంత్రికి వ్యాపారంలో వాటాలు ఇచ్చాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీల మైనింగ్ లీజుల కాలపరిమితిని పొడిగించారు. మరికొన్నింటి లీజులను రెన్యువల్ చేశారు. వాటికి సంబంధించిన 25 ఫైళ్లను గనుల తిమింగలం మాయం చేసినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక వెళ్లింది.
గనుల్లో మంత్రికి వాటాలు
జగన్ ప్రభుత్వంలో మైనింగ్ వ్యవహారాల్లో అనేక చీకటి కోణాలు చోటు చేసుకున్నాయి. విలువైన గనులను బలవంతంగా చేజిక్కించుకోవడం లేదా తాము చెప్పిన వారి పేరిట వ్యాపార వాటాలు రాయించుకోవడం వంటివి చేశారు. నాటి జగన్ ప్రభుత్వంలోని సదరు మంత్రి.. లీజుదారులు, వ్యాపారులను నయానో, భ యానో దారికి తెచ్చుకున్నారు. కీలకమైన గనుల్లో వాటాలు దక్కించుకున్నారు. ఇందుకు ఆయన పేషీలోని ఓఎస్డీ, శశి అనే ప్రైవేటు వ్యక్తి కీలకపాత్ర పోషించారు. ఆ మంత్రి కోసం గనుల శాఖ కీలక అధికారి మంత్రాంగం నడిపారు. లీజుదారుల ఫైళ్లను వెంటనే ఆమోదించకపోవడం... ఫైళ్లలో తప్పులు చూపిస్తూ కొర్రీలు వేసి పెండింగ్‌లో పెట్టడం... ఆఫీసుకు పిలిపించుకొని సెటిల్‌చేయడం వంటివి చేశారు. నాడు సదరు మంత్రి కేంద్రంగా జరిగిన అక్రమాల్లో తెరవెనక పాత్ర ఈ తిమింగలానిదే. గనుల వెంకటరెడ్డి పలు కారణాలతో 2023, 2024లో పక్షం రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో ఆ మంత్రి స్పీడ్ పెంచి గనులలో వాటాల దందా నడిపించారు. ఇందుకు ఈ అధికారి పూర్తిస్థాయిలో సహకరించారు.
లీజుదారులకు బెదిరింపులు
ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో 8 గ్రానైట్, లేటరైట్ లీజుదారులను పిలిపించి సదరు అధికారి పంచాయితీ నిర్వహించారు. అవి లాభదాయకమైన గనులు కావడంతో మంత్రికి వాటాలు ఇవ్వాలని ఒత్తిళ్లు తీసుకొచ్చారు. లేనిపక్షంలో లీజుల కాలపరిమితిని పొడిగించరని, మరో సంస్థకు కేటాయించాల్సి ఉంటుందని బెదిరించారు. అంతేగాక అప్పటిదాకా చేసిన మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని గనుల శాఖ విజిలెన్స్ విభాగంతో తనిఖీలు నిర్వహించి 10-40 రెట్లు పెనాల్టీ వేస్తామని భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో భయపడిన లీజుదారులు తమ కంపెనీల్లో వాటాలు ఇస్తామని లిఖితపూర్వక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత కంపెనీల యాజమాన్యంలో మార్పులు చేసినట్లు రికార్డులు చూపించి మైనింగ్ చేపట్టారు. అలా మంత్రి రూపాయి పెట్టుబడి లేకుండానే వాటాలు దక్కించుకున్నారు. ఇందుకుగాను సదరు అధికారికి భారీ ప్రతిఫలమే దక్కింది. నెల్లూరు జిల్లాలోనూ ఓ కాంట్రాక్టర్‌ను ఆ అధికారి బెదిరించారు. మాట విననందుకు విజిలెన్స్ తనిఖీలు చేయించి 120 కోట్ల పెనాల్టీ వేయించారు. విశాఖలోనూ కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖ మైనింగ్ వ్యాపారిని ఇలాగే బెదిరించారు. తనిఖీలు చేయించి 150 కోట్ల పెనాల్టీ వేయించారు.
సీఎంకు మంత్రి కొల్లు ఫిర్యాదు
గనుల శాఖ తిమింగలం చేసిన అరాచకాలు, అక్రమాలపై నవంబరులో మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి గనుల శాఖలో అక్రమాలపై నివేదిక ఇచ్చారని సమాచారం. ‘ఇలాంటి అక్రమార్కులతో మేం అద్భుతమైన ఫలితాలు ఎలా సాధించగలం? ఆ అఽధికారులతో కలిసి ఎలా పనిచేయగలం? చర్యలు తీసుకోండి’ అని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. ఆ త ర్వాత సదరు అధికారిని సెలవుపై పంపాలని చూసినా ఇద్దరు మంత్రులు, ఓ ఎంపీ ఒత్తిడి చేసి కాపాడారు. దీంతో శాఖలో ఆయన దర్జాగా ఉన్నారు.
అవే కీలకం
గనుల ఘనుడు వెంకటరెడ్డి కేసును ఏసీబీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక, ఇతర అంశాల్లో విచారణలో భాగంగా ఎండీసీ, గనుల డైరెక్టరేట్ పరిధిలోని కీలక ఫైళ్లను తమకు అప్పగించాలని కోరింది. గ్రానైట్, లేటరైట్, సిలికా, క్వార్ట్జ్ తదితర గనుల లీజుల పర్మిట్ల పొడిగింపు, రెన్యువల్ ఫైళ్లు తమకు రాలేదని ఏసీబీ గుర్తించింది. వాటి గురించి గనుల శాఖలో ఆరా తీసింది. సంబంధిత ఫైళ్లు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. గత రెండున్నర నెలలుగా వెతికినా ఆ ఫైళ్ల ఆనవాళ్లు దొరకలేదు. ఆ ఫైళ్లు గల్లంతయ్యాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఏసీబీకి, ప్రభుత్వ పెద్దలకు గనుల అధికారులు ఈ విషయాన్ని మౌఖికంగా నివేదించినట్లు తెలిసింది. మైనింగ్ లీజుదారుల నుంచి బలవంతంగా వాటాలు దక్కించుకున్న కేసులకు సంబంధించి 25 ఫైళ్లు కనిపించడం లేదు. వాస్తవానికి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, కౌంటింగ్‌కు ముందు గనుల శాఖలో అనేక ఫైళ్లను మాయం చేశారు. అందులో లీజు పర్మిట్ల పొడిగింపు, రెన్యువల్స్ ఫైళ్లే ఎక్కువగా ఉన్నాయి. కొన్నింటిని గంపగుత్తగా పోగేసి తగులబెట్టారు. ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పలు సందర్భాల్లో బయటపెట్టింది.