Amaravati : ఇంటర్ విద్యార్థులకు సర్కారు కానుక
ABN , Publish Date - Jun 19 , 2024 | 02:59 AM
కూటమి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు అందింది!. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు
బ్యాగులు కూడా.. ఉత్తర్వులు జారీ
2 లక్షల మందికి మేలు చేసే నిర్ణయం
గత ప్రభుత్వంలో ఉచితానికి మంగళం
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు అందింది!. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మొదటి సమీక్షలో దీనిపై అధికారులను ఆదేశించగా, ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివినా పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వలేదు. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 2లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
వారికి పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు రూ.15 కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఆ నిధులను జగన్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మంగళం పాడేశారు. కాగా ఈ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్లలో ఫస్టియర్ విద్యార్థులు 108619 మంది, సెకండియర్ విద్యార్థులు 92134 మంది ఉన్నారు. వీరికి జూలై 15లోగా పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. పాఠ్య పుస్తకాలను తెలుగు అకాడమీ, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల డైరెక్టర్ ద్వారా సమకూర్చాలని, నోట్ పుస్తకాలు, బ్యాగులు అదనంగా కొనుగోలు చేయాలని ఆదేశించింది.