Share News

YS Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా?

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:50 AM

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా?

YS Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా?

  • అవినాశ్‌రెడ్డితో రాజీనామా చేయించి

  • కడప ఎంపీగా పోటీ చేసే యోచన!

  • పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా

  • సతీమణి భారతిలను దింపే ఆలోచన

  • విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ

  • భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన

  • చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన

  • ఢిల్లీలో ఉంటే ‘కేసుల’ మేనేజ్‌కూ చాన్స్‌

  • వైఎస్‌ జయంతి సందర్భంగా నేడు ప్రకటన?

  • సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

  • నిర్ధారించని వైసీపీ సీనియర్‌ నాయకులు

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా? కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో విపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. వచ్చే ఐదేళ్లు కూటమి సర్కారును, ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఎదిరించి నిలవలేనని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్‌ రాజీనామా చేస్తారని, అదేవిధంగా తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఆ వెంటనే కడప ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో జగన్‌ పోటీ చేస్తారని, పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తన మాతృమూర్తి విజయలక్ష్మి లేదా సతీమణి వైఎస్‌ భారతిలను రంగంలోకి దింపుతారని కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. అదేసమయంలో భారతికి వైసీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించి, తాను ఢిల్లీకే పరిమితమయ్యేలా జగన్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు ఈ ప్రచారం చాటి చెబుతోంది. ఎంపీగా ఉంటే.. తనపై నమోదైన అక్రమాస్తుల కేసులను మేనేజ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా ఆయన తలపోస్తున్నట్టు సోషల్‌ మీడియా భావిస్తోంది.

అదేసమయంలో ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకం కావొచ్చన్నది ఆయన ఆలోచనగా ఉన్నట్టు చెబుతున్నారు. సోమవారం జరగనున్న దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కడపలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ సమాధి వద్ద జగన్‌ నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందని సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగుతుండడం గమనార్హం.


అధికారం నేలమట్టం కావడంతో

2019లో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం దక్కించుకున్న వైసీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో నేలమట్టమైంది. దీంతో గత ఐదేళ్లు మితిమీరిన స్థాయిలో అధికారం చలాయించిన జగన్‌కు ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. పైగా అసెంబ్లీలో 11 స్థానాలే ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. తమకు సంఖ్యా బలం లేకున్నా ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టాలంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి జగన్‌ లేఖ రాశారు. అయినప్పటికీ.. నిబంధనల మేరకు ఆయన కోరికను మన్నించే పరిస్థితి, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయాయి. దీంతో జగన్‌ కేవలం సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోనున్నారు. జగన్‌ స్వభావాన్ని బట్టి చూస్తే ఈ పరిస్థితిని జీర్ణించుకునే అవకాశం ఆయనకు లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేగా తప్పుకోవడమే మంచిదనే భావనలో ఆయన ఉన్నట్టు వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఎదిరించి నిలబడే పరిస్థితి కూడా ఆయనకు లేదని అంటున్నాయి. అటు సభలోను, ఇటు బయట కూడా జగన్‌ పరిస్థితి దారుణంగానే ఉంటుందని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉత్తమమని జగన్‌ భావిస్తున్నట్టు వైసీపీ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోందని సమాచారం. అయితే.. ఈ ప్రచారాన్ని సీనియర్లు కొందరు ఖండిస్తున్నారు. అలాంటిదేమీ ఉండదని అంటున్నా.. ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.


ఢిల్లీలో ఉంటే..

పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన అనంతరం.. కడప ఎంపీగా జగన్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారాన్ని గమనిస్తే.. ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో ఉంటూ.. అక్కడ వైసీపీ రాజకీయాలను చక్కబెట్టుకునే దిశగా జగన్‌ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసులను ఢిల్లీ స్థాయిలో మేనేజ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇదేసమయంలో రాష్ట్ర వైసీపీ బాధ్యతలను తన సతీమణి వైఎస్‌ భారతికి అప్పగించే యోచనలో జగన్‌ ఉన్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ప్రచారాన్ని వైసీపీ సీనియర్లు నిర్ధారించడం లేదు. కానీ, జగన్‌ మనస్తత్వం తెలిసిన వారు.. ఏమైనా జరగొచ్చని అంటున్నారు. పరిస్థితి ఎలా ఉన్నా.. తన ఇగోకు ప్రాధాన్యం ఇచ్చే జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఒకవేళ వైఎస్‌ జయంతి సందర్భంగా కాకపోయినా.. వచ్చే రెండు మూడు మాసాల్లో అయినా.. జగన్‌ తాను అనుకున్నదే చేస్తారని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - Jul 08 , 2024 | 08:56 AM