అమరావతిలో 50 కోట్లతో తపాలా ప్రధాన కార్యాలయం
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:18 AM
‘అమరావతిలో రూ.50 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరో రూ.20 కోట్లతో అక్కడే పోస్టల్ ఉద్యోగులకు నివాస గృహసముదాయాన్ని కూడా నిర్మించబోతున్నాం’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
మరో 20కోట్లతో ఉద్యోగుల క్వార్టర్లు: కేంద్ర మంత్రి పెమ్మసాని
కేంద్రం నిధులతో కొండవీడు అభివృద్ధికీ కృషి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
చిలకలూరిపేట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘అమరావతిలో రూ.50 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరో రూ.20 కోట్లతో అక్కడే పోస్టల్ ఉద్యోగులకు నివాస గృహసముదాయాన్ని కూడా నిర్మించబోతున్నాం’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రూ.2.3 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న హెడ్‌పోస్టాఫీసు భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. యర్రగొండపాలెం పోస్టాఫీసు నూతన భవన ప్రారంభోత్సవం, ప్యాపిలి పోస్టాఫీసు నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా మంత్రి ఆన్‌లైన్ ద్వారా చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని మాట్లాడుతూ... ‘దేశంలో అవినీతి అతి తక్కువగా ఉన్న ప్రభుత్వ శాఖ పోస్టల్ శాఖ.
రాష్ట్రంలో 10 వేల పోస్టాఫీసులు ఉన్నాయి. తపాలా సేవల విషయంలో ఆంధ్ర సర్కిల్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడం గర్వకారణం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగిస్తూ పోస్టల్ సేవలను సిబ్బంది బలోపేతం చేస్తున్నారు’ అని అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి మేరకు కేంద్రం నుంచి నిధులు తెచ్చి కొండవీటి కోటను అభివృద్ధి చేేసందుకు తమవంతు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, తపాలా శాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాశ్, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఆర్డీవో మధులత, విజయవాడ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ డిఎ్‌సవిఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.