Share News

AP Transco : అమరావతిలో అండర్‌గ్రౌండ్‌ దందా

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:51 AM

అమరావతిలో వేసేది 1000 స్క్వేర్‌ ఎంఎం సామర్థ్యం గల కేబుల్‌. కిలోమీటరు వేయడానికి జీఎస్టీతో సహా ఏపీ ట్రాన్స్‌కో పిలిచిన ధర రూ.1.86 కోట్లు.

AP Transco : అమరావతిలో అండర్‌గ్రౌండ్‌ దందా

  • భూగర్భ విద్యుత్‌ లైన్‌కు ‘హై’ టెండర్లు

  • ప్రభుత్వానికి రూ.156 కోట్ల నష్టం

  • అత్యధిక ధరలకు ట్రాన్స్‌కో టెండర్లు

  • కూటమి ప్రభుత్వానికి తెలియకుండా మాయ

  • జగన్‌ హయాంలోని అధికారుల కుట్ర

  • తెలంగాణలోని ధరల కంటే చాలా ఎక్కువ

ఓ వైపు జగన్‌ సర్కారు మిగిల్చిపోయిన అప్పులు.. మరోవైపు నిధుల కొరత. అయినా రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. కేంద్ర సాయంతో పాటు బ్యాంకు రుణాలు తీసుకుంటూ పనులకు శ్రీకారం చుడుతోంది. ఇటు ఏపీ ట్రాన్స్‌కో అధికారులు మాత్రం రాజధానిలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ టెండర్లలో ప్రభుత్వానికి 156 కోట్లు నష్టం కలిగిస్తున్నారు.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

అమరావతిలో వేసేది 1000 స్క్వేర్‌ ఎంఎం సామర్థ్యం గల కేబుల్‌. కిలోమీటరు వేయడానికి జీఎస్టీతో సహా ఏపీ ట్రాన్స్‌కో పిలిచిన ధర రూ.1.86 కోట్లు. అదే హైదరాబాద్‌ గచ్చిబౌలిలో దీనికంటే 20 శాతం ఎక్కువ సామర్థ్యం.. 1,200 స్క్వేర్‌ ఎంఎం కేబుల్‌ వేయడానికి కి.మీ.కు జీఎస్టీతో సహా టీజీ ట్రాన్స్‌కో పిలిచిన ధర రూ.1.69 కోట్లు. అంటే.. గచ్చిబౌలిలో కంటే అమరావతిలో తక్కువ సామర్థ్యం కేబుల్‌ వేసేందుకు అక్కడి కంటే భారీ ధరకు టెండర్‌ పిలిచారు. అది కూడా ప్రభుత్వానికి తెలియకుండా! దీనిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు ఇంకా పాత పోకడలు వీడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా, అప్రతిష్ఠ కలిగించేలా ఏపీ ట్రాన్స్‌కో అధికారులు వ్యవహరించారు. ప్రభుత్వానికి తెలియకుండా రాజధాని అమరావతిలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్లు వేయడానికి ఇటీవల అత్యధిక రేట్లతో టెండర్లు పిలిచారు.


తద్వారా ప్రభుత్వానికి రూ.150 కోట్లకు పైగా నష్టం కలిగిస్తున్నారు. ఈ ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు తెలియడంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లు (ఎస్‌ఎ్‌సఆర్‌)ను పెంచేసిన ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏడాదిన్నరగా వాటిని సవరించలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా పాత పంథానే అనుసరిస్తున్నారు.

ఇదీ విషయం...

సీఆర్‌డీఏ పరిధిలో భూగర్భ విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కో అధికారులు సెప్టెంబరులో రెండు టెండర్లు పిలిచారు. అండర్‌ గ్రౌండ్‌ కాపర్‌ కేబుల్‌ ఎక్స్‌ఎల్‌పీఈ 220 కేవీ 1000 స్క్వేర్‌ ఎంఎం లైన్లను రూ.993.24 కోట్లతో 24 నెలల్లో పూర్తి చేసేందుకు ఒక టెండర్‌ పిలిచారు. 220 కేవీ జీఐఎస్‌, 220 కేవీ డీసీ 1000 స్క్వేర్‌ ఎంఎం ఎక్స్‌ఎల్‌పీఈ లైన్లకు సంబంధించి రూ.253.74 కోట్లతో 18 నెలల్లో పూర్తి చేసేందుకు మరో టెండర్‌ను పిలిచారు. ఈ రెండు టెండర్ల మొత్తం విలువ రూ.1,246.98 కోట్లు. ఈ టెం డర్ల రూపకల్పనలో ఏపీ ట్రాన్స్‌కో అధికారులు అడ్డగోలుగా రేట్లు పెంచారన్న ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్‌లో అలా.. ఇక్కడ ఇలా..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శివరామపల్లి నుంచి గచ్చిబౌలి వరకు అక్కడి ప్రభుత్వం అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్స్‌ పనులకు రూ.114.44 కోట్లకు టెండర్లు పిలిచింది. అమరావతిలో తలపెట్టే 1000 స్క్వేర్‌ ఎంఎం కంటే ఎక్కువగా.. 1,200 స్క్వేర్‌ ఎంఎం సామర్థ్యంతో కూడిన అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ వేయాలి. ఏపీ ట్రాన్స్‌కో టెండర్లలో నిర్దేశించిన యూనిట్‌ రేటుకు, టీజీ ట్రాన్స్‌కో పిలిచిన రేట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. అమరావతిలో కంటే 20 శాతం అధిక సామర్థ్యంతో కూడిన అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్స్‌ కోసం టీజీ ట్రాన్స్‌కో జీఎ్‌సటీతో సహా కిలోమీటరుకు రూ.1.69 కోట్లతో చేపట్టేందుకు యూనిట్‌ రేటును నిర్దేశించింది.


అదే ఏపీ ట్రాన్స్‌కో 20 శాతం తక్కువ సామర్థ్యంతో కూడిన అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్స్‌కు సంబంధించి జీఎస్టీతో సహా కిలోమీటరుకు రూ.1.86 కోట్లతో చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. గచ్చిబౌలిలో టీజీ ట్రాన్స్‌కో టెండర్లు ఇంచుమించుగా ఏపీ ట్రాన్స్‌కో పిలిచిన సమయంలోనే పిలిచారు. ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చిందన్న దానిపై ఏపీ ట్రాన్స్‌కో అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏపీ ట్రాన్స్‌కో పిలిచిన 20 శాతం తక్కువ సామర్థ్యం కలిగిన అండర్‌ గ్రౌండ్‌ కేబుల్స్‌ కారణంగా కిలోమీటరుకు రూ.51 లక్షలు తగ్గిస్తే.. మొత్తం 300 కిలోమీటర్లకు రూ.153 కోట్ల మేర ఖర్చు తగ్గాలి.

కేంద్రం ధరల కంటే ఎక్కువ

జూలై 14న కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఇండి కేటివ్‌ కాస్ట్‌ మాట్రిక్స్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే 220 కేవీ డీసీ లైన్‌ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ లేయింగ్‌ కాస్ట్‌ (ఏడు వైర్లు)ను కిలోమీటరుకు రూ7.2 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఏపీ ట్రాన్స్‌కో పిలిచిన ప్రస్తుత టెండర్‌లో కిలోమీటర్‌ ధర సుమా రు రూ.14.5 కోట్లుగా ఉంది. కేంద్ర విద్యుత్‌ మంత్రి త్వ శాఖ నిర్దేశించిన దానికంటే దాదాపు రూ.7 కోట్ల మేర అదనపు రేటుతో టెండర్లు పిలిచారు. టీజీ ట్రా న్స్‌కో ప్రకారం చూస్తే రూ.156 కోట్లు, కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్రకారం చూస్తే రూ.300 కోట్ల వరకు అదనంగా కోట్‌ చేస్తూ టెండర్లు పిలిచారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ మేరకు అదనపు భారం పడుతోంది.

Updated Date - Dec 27 , 2024 | 03:52 AM