Ayyanna Patrudu: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. మూడు నెలల్లో జగన్ జైలుకే!
ABN , Publish Date - Jan 30 , 2024 | 02:58 PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తాజాగా సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కా 420 అని.. జైలుకు వెళ్లడానికే ఆయన భీమిలిలో ‘సిద్ధం’ సభను నిర్వహించారని అన్నారు. మరో మూడు నెలల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కా 420 అని.. జైలుకు వెళ్లడానికే ఆయన భీమిలిలో ‘సిద్ధం’ సభను నిర్వహించారని అన్నారు. మరో మూడు నెలల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. ‘సిద్ధం’ సభలో జగన్ ‘శిలువ’ మీద క్యాట్ వాక్ చేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఓ సీఎంలా వ్యవహరించడం లేదని, పగటి వేషగాడిలా ప్రవర్తిస్తున్నాడని విరుచుకుపడ్డారు. తాను డబ్బా కొట్టినట్టు జగన్ అర్జునుడు ఏం కాదని.. సిద్ధం సభలో చెప్పిందంతా సోదేనని దుయ్యబట్టారు. రాజమహేంద్రవరం పదాన్ని సైతం జగన్ స్పష్టంగా ఉచ్ఛరించలేకపోయారని విమర్శించారు. లండన్‌లో లేదా మరెక్కడైనా దాక్కున్నా.. జగన్‌ని ఏమాత్రం విడిచిపెట్టమని హెచ్చరించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. జగన్ తిన్న డబ్బులన్నింటినీ కక్కిస్తామని ఉద్ఘాటించారు.
ఇదేం న్యాయం..?
ఎస్సీని చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకొని.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారా? అని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రాజధాని చేస్తానని చెప్పి విశాఖను జగన్ నిండా దోచేశారని, చివరికి విశాఖ కోడిపుంజులను కూడా పట్టుకుపోయారని తూర్పారపట్టారు. 98 శాతం హామీలు ఎక్కడ అమలు చేశారు జగన్? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం.. వంటివి ఏమీ అమలు చేయలేదన్నారు. అమరావతి రాజధాని లేదని.. మూడు రాజధానులు కూడా లేవన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక దొంగ నాకొడుకని, అతడు చెప్పేవన్నీ అబద్ధాలే విరుచుకుపడ్డారు. రూ.3 వేల పెన్షన్ల విషయంలోనూ జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. 40 ఏళ్లకు పెన్షన్ అని మాటిచ్చి.. దానిని పక్కన పెట్టేశారన్నారు. ఇళ్ళ విషయంలోనూ జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్లకు ఆర్ధిక సహాయం అందిస్తోందని.. అయితే మోదీ గొడుగుని తన గొడుగగా జగన్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు.
సమాధానమివ్వండి సీఎం?
గాదిరాజు ప్యాలెస్ మీద కూడా కన్నేశారని.. భారతికి నచ్చితే ఆ ప్యాలెజ్‌ని దొబ్బేస్తారా? అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. ప్రజల పాస్ బుక్ మీద, ఆఖరికి సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో ఎందుకు ఉందని ప్రశ్నించారు. భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఒరిజినల్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకోవడం ఏంటి? అమ్ముకోవడానికా? అని అడిగారు. రాత్రుల సమయంలో తనని చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని అయ్యన్న కుండబద్దలు కొట్టారు. అందుకే గన్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నానన్నారు. అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం తన తనయుడు దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని తిరిగి ప్రశ్నించారు. అనకాపల్లిలో వైసీపీ నేతలు 1200 ఎకరాలకు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని.. తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ భూ కుంభకోణాలపై సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరిన ఆయన.. న్యాయం కోసం న్యాయస్థానానికి కూడా వెళ్తానన్నారు.