వలంటీర్లు నా సైన్యం!
ABN , Publish Date - Apr 05 , 2024 | 05:28 AM
‘వలంటీర్లు నా సైన్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైలుపైనే పెడతానని నాయుడుపేట బహిరంగసభ వేదికగా ప్రకటించారు. ఇన్నాళ్లూ విపక్షాలు చెబుతున్నది కూడా ఇదేకదా అని
వలంటీర్లు నా సైన్యం..
మరోసారి అంగీకరించిన సీఎం జగన్
విపక్షాలు చెబుతున్నదీ ఇదే కదా అని జనం గుసగుస
జనం లేక నాయుడుపేట ‘సిద్ధం’ సభ వెలవెల
400 ఆర్టీసీ బస్సులు కేటాయించినా జనం లేక బోసిపోయిన సభా ప్రాంగణం
నాయుడుపేట, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ‘వలంటీర్లు నా సైన్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల(Volunteers) వ్యవస్థకు సంబంధించిన ఫైలుపైనే పెడతానని నాయుడుపేట బహిరంగసభ వేదికగా ప్రకటించారు. ఇన్నాళ్లూ విపక్షాలు చెబుతున్నది కూడా ఇదేకదా అని ఆ సభలోని జనం గుసగుసలాడుకోవడం కనిపించింది. వలంటీర్లు రాజకీయాల్లో వేలుపెట్టడాన్ని తొలినుంచీ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వలంటీర్లను కేవలం ప్రభుత్వ పథకాల అమలు వరకే వినియోగించుకోకుండా వైసీపీ కార్యకర్తల్లా వాడుకోడంపై కోర్టులను ఆశ్రయించాయి. చివరికి ఈసీ ఆదేశాలతో వలంటీర్లను తొలుత ఎన్నికల విధులకు దూరం పెట్టారు. తాజాగా పెన్షన్ల పంపిణీకి కూడా వారిని ఈసీ అనుమతించలేదు. ఈ నేపధ్యంలో జగన్ చేసిన ప్రకటన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని తేల్చేశాయి. మరోవైపు ఆర్భాటాలు, అబద్ధాలతో నిండి ఉండే ఆయన ప్రసంగాలు పదేపదే విని.. విని.. విసిగిపోయిన జనాలు, జగన్ రాకముందే జారుకున్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే మిగతా జనాలూ లేచి పోయారు. గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. సభా ప్రాంగణమంతా వెలవెలబోయింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో గురువారం సీఎం జగన్ పాల్గొన్న ‘మేమంతా సిద్ధం’ బహిరంగసభ తీరు ఇదీ. 400 ఆర్టీసీ బస్సులు కేటాయించినా జనసమీకరణ ఆశించిన మేరకు జరగలేదు. ఆయన ప్రసంగంలో అబద్ధాలే ఎక్కువగా వినిపించాయి. ‘వలంటీర్లు నా సైన్య’మంటూ కొన్ని నిజాలు కూడా ఆయన ఒప్పేసుకున్నారు. జగన్ సభా వేదికపైకి చేరుకునే సరికి గ్యాలరీలన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో రోడ్లపై ఉన్న జనాన్ని ప్రాంగణంలోకి వెళ్ళాలంటూ పోలీసులు బతిమాలడం కనిపించింది. ముందు వరుస గ్యాలరీల్లో పలచగా వున్న జనం కూడా ఆయన ప్రసంగం మొదలుపెట్టిన పది నిమిషాల నుంచే వెనుదిరిగి వెళ్లిపోవడం మొదలైంది. ఇప్పటివరకూ జరిగిన ‘మేమంతా సిద్ధం’ సభల్లో ఇంత దారుణంగా సభ విఫలం కావడం ఇదే తొలిసారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
రోజంతా జనానికి నరకం
రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో బుధవారం రాత్రి బస చేసిన సీఎం జగన్ గురువారం ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించారు. దాదాపు 53 కిలోమీటర్ల పరిధిలో పలు గ్రామాల గుండా ప్రయాణించి నాయుడుపేటకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. అయితే, పోలీసులు చేపట్టిన అతి చర్యలు రోజంతా ప్రజలకు నరకం చూపించాయి. రేణిగుంటలో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కావడానికి గంట, రెండు గంటల ముందే ట్రాఫిక్ ఆపేశారు. చెన్నై, కడప, నెల్లూరు, తిరుపతి మార్గాలు నాలుగూ కీలకం కావడం, గంటకు వేల వాహనాలు ప్రయాణించే ఈ మార్గాల్లో రెండు గంటల పాటు ట్రాఫిక్ ఆపడంతో వేలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ ఆగిపోయాయి. బస్సు యాత్ర ప్రారంభమైన అరగంట తర్వాత వాహనాల రాకపోకలకు అనుమతించినప్పటికీ ట్రాఫిక్ జామ్ కావడంతో మరో రెండు గంటల పాటు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేసవిలో ఎండ ధాటికి తోడు ఉక్కపోతకు వాహనాల్లోని జనం నరకయాతన అనుభవించారు. తిరుపతి జిల్లాలో మొత్తం 1100 ఆర్టీసీ బస్సులుండగా వాటిలో 400 బస్సులను ‘మేమంతా సిద్ధం’ సభ కోసం తరలించారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో బస్సుల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. రూట్లపై నడిచిన మిగిలిన బస్సులు కూడా జగన్ బస్సు యాత్ర కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయి గంటల కొద్దీ ఆలస్యంగా నడిచాయి. దీంతో బస్టాండ్లలో గంటలపాటు ప్రయాణికులు బస్సులకోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.
డ్రైవర్ల సమస్యలపై స్పందించని జగన్
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్య గ్రామం వద్ద జగన్....లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖీ సమావేశమయ్యారు. వారు సమస్యల గురించి చెబితే పట్టించుకోలేదు. అనంతపురం జిల్లా శింగనమలలో టిప్పర్ డ్రైవర్‌కు అసెంబ్లీ టికెట్ ఇచ్చానని, దాన్ని చంద్రబాబు అవహేళన చేశారని ఆరోపించారు. పలువురు డ్రైవర్లు తమ సమస్యల గురించి ప్రస్తావించగా దానిపై ఆయన ఏమాత్రం స్పందించలేదు. చివరగా మాత్రం, సూచనల పెట్టెలు రెండు ఏర్పాటు చేశామని, ఎవరైనా సలహాలు, సూచనలు చేయదలిస్తే స్లిప్పు రాసి ఆ పెట్టెల్లో వేస్తే తాను తర్వాత పరిశీలిస్తానంటూ చెప్పి నిష్క్రమించారు.
సీఎం సహాయ నిధి చెక్కు చెల్లాలంటే 40రోజులు ఆగాలట!
గురవరాజుపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన జగన్, కొంచెందూరం వెళ్లగానే వెదుళ్ల చెరువు వద్ద తండ్రీ కొడుకులు బస్సును ఆపారు. తన 12 ఏళ్ల కుమార్తె చైత్ర వినికిడి సమస్యతో బాధపడుతుంటే ఆపరేషన్ చేయించామని తండ్రి వివరించాడు. దానికి సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేయగా చెక్కు వచ్చిందని, కానీ చెల్లడం లేదని వాపోయాడు. సీఎం సహాయనిధి నుంచి సాయం అందాలంటే 40 రోజలు ఆగాలి అని సమాధానం ఇచ్చి జగన్ ముందుకు సాగిపోవడంతో వారు తెల్లబోయారు.