Victim's Complaint : ఆళ్ల నా భూమిని కబ్జా చేశారు
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:16 AM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు అందింది.
వర్షపు నీరు పోక పంట దెబ్బతింటోంది
టీడీపీ నేతలకు ఓ బాధితుడి ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వినతుల కార్యక్రమంలో కబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు అందింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, వ్యవసాయ మిషన్ వైస్ చైౖర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజల నుంచి ఈ వినతులు స్వీకరించారు. ‘మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నా భూమిని ఆక్రమించారు. దీంతో మిగిలిన వ్యవసాయ భూమి నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే దారిలేక పంట దెబ్బ తింటోంది. ఈ కబ్జా నుంచి నా భూమిని విడిపించండి’ అంటూ మంగళగిరికి చెందిన వి.పూర్ణచంద్రరావు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై విచారణ జరిపించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర మాట్లాడుతూ, ‘వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మా గ్రామం వచ్చారు. ఆ రోజు మా ఇంటిపై టీడీపీ జెండా చూశారు. నాపై కేసులు పెట్టించి రౌడీ షీట్ తెరిపించారు. ఐదేళ్లుగా రాజకీయ వేధింపులకు గురవుతున్నా.
నాపై రౌడీ షీట్ ఎత్తివేయించండి’ అని విజ్ఞప్తి చేశారు. తనకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని తమ గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించడంతోపాటు తన ఇంటిని కూడా కూలగొట్టి ఆక్రమించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తన భూమిని తనకు ఇప్పించాలని తిరుపతి జిల్లా ఆర్‌సీ పురం మండలం చిత్తాటూరు గ్రామానికి చెందిన పి.భూపతి కోరారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం అల్లాగుంట గ్రామంలో ఎనిమిది సెంట్ల పోరంబోకు భూమిని ఇద్దరు వ్యక్తులు ఆక్రమించారని, వారి నుంచి దానిని విడిపించి పేదలకు ఇవ్వాలని ఆ గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో కాకర గొంతెమ్మ అనే మహిళ తన ఎకరా భూమిని కొట్టేసిందని, తనకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా దొర్లపూడి గ్రామానికి చెందిన బొల్లం వరహాలమ్మ విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన సిమెంట్ రోడ్లను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, మళ్లీ వాటిని మంజూరు చేయాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు గ్రామానికి చెందిన కాకొల్లు రమణయ్య కోరారు.