Pawan Kalyan : పారదర్శకత లేని వైసీపీ పాలన
ABN , Publish Date - Nov 27 , 2024 | 05:50 AM
సమోసాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆసలు బాధ్యత అనేది లేకుండా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమోసాల కోసం 9 కోట్ల ఖర్చు.. బాధ్యత లేకుండా వ్యవహరించారు
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
అదానీ-జగన్ వ్యవహారంపై సీఎంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
న్యూఢిల్లీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): సమోసాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆసలు బాధ్యత అనేది లేకుండా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లేవన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పులకు బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలిచ్చారు. అదానీ-జగన్ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్జీవీ వ్యవహారంపై స్పందిస్తూ పోలీసులు వాళ్ల పని చేస్తున్నారని అన్నారు. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని, మీరు అడగాల్సింది ముఖ్యమంత్రిని అని మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ మీడియా అడిగిందని సీఎంకి చెబుతానని చెప్పారు.
నేడు ప్రధానితో పవన్ భేటీ
కాగా, పవన్ కల్యాణ్ నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంటు భవనంలో ఉదయం 11కు మోదీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి భూపిందర్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.