AP Elections 2024: ఎన్నికల ముందు.. వైఎస్ జగన్‌కు మరో షాక్!
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:53 AM
జగన్ సర్కారుకు ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి మరీ వైసీపీ సేవలో తరిస్తున్న మరో ఇద్దరు ఐపీఎ్‌సలపై బదిలీ వేటు వేసింది.
‘వీరభక్త’ ఐపీఎస్‌లపై ఈసీ వేటు
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ బదిలీ
ఎన్నికలతో సంబంధంలేని విధుల్లోకి ఆ ఇద్దరు
సత్వరం రిలీవ్ కావాలని ఆదేశాలు
జగన్‌కు కళ్లూ చెవులుగా పీఎస్సార్ ఆంజనేయులు
వైసీపీ రాగానే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి
కోడెలను ఇరికించడం నుంచి బాబు అరెస్టు దాకా!
ఆది నుంచీ విపక్ష నేతలే లక్ష్యంగా విధులు
జగన్‌పై ఈగవాలినా సహించని కాంతిరాణా
ఐపీఎ్‌సల సంఘం తరఫున తానే వకాల్తా
విపక్షాలు, మీడియాపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
‘గులకరాయి’ దర్యాప్తు తీరుపై విమర్శలు
అమరావతి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జగన్ (YS Jagan) సర్కారుకు ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి మరీ వైసీపీ (YSR Congress) సేవలో తరిస్తున్న మరో ఇద్దరు ఐపీఎస్‌లపై బదిలీ వేటు వేసింది. జగన్‌కు కళ్లు, చెవులుగా పనిచేస్తోన్న ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అదే స్థాయిలో స్వామి భక్తి ప్రదర్శిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతాను ఎన్నికలతో సంబంధంలేని విధులకు బదిలీ చేయాలని మంగళవారం ఆదేశించింది. వీరిద్దరి స్థానంలో కొత్త అధికారుల నియామకం కోసం... ముగ్గురేసి పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు జాబితా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించింది. వీరిద్దరూ సత్వరం తమ కిందిస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి... రిలీవ్ కావాలని ఆదేశించింది. కోడ్ వెలువడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లను పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు... మరో ఇద్దరు ఐపీఎస్‌లపై బదిలీ వేటు వేయడం, అందులోనూ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులునే పక్కన పెట్టడం జగన్‌కు పెద్ద షాక్ అని ఐపీఎస్ వర్గాలు చెబుతున్నాయి. పీఎస్సార్, కాంతిరాణాపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, వారిపై ఆరోపణలను ధ్రువీకరించుకున్న తర్వాతే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎవరీ పీఎస్సార్?
పీఎస్సార్ ఆంజనేయులు పేరుకే ఇంటెలిజెన్స్ చీఫ్! కానీ... మొత్తం పోలీసు యంత్రాంగం ఆయన ‘కంట్రోల్’లోనే ఉందని చెబుతారు. డీజీపీని కూడా డమ్మీగా మార్చేసి... ఎస్పీలను తన చుట్టూనే తిప్పకుంటారని ఆరోపణ ఉంది. ఎన్నికలను ‘మేనేజ్’ చేసే బాధ్యతలను కూడా జగన్... పీఎస్సార్‌కు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఆయనపై ఈసీ వేటు వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర సర్వీసులకు వెళ్లిన పీఎస్సార్... జగన్ సీఎం కాగానే రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయనకు అత్యంత కీలకమైన పోస్టు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అలా జరగలేదు. ఇతర పోస్టుల్లో ఉన్నా... ముఖ్యమంత్రికి నచ్చని వారిని ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల్లో ప్రభుత్వ పెద్దకు నచ్చని వారి జాబితా సేకరించి అసలు పని ప్రారంభించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని ఇరుకున పెట్టడం నుంచి తాజాగా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారు రాజేశ్‌పై నిఘా వరకూ పీఎస్సార్ పాత్రే కీలకమని చెబుతారు.
మాజీ న్యాయమూర్తి కుమార్తెలపై కేసు పెట్టడం, విద్యాశాఖలో ఉన్నతస్థాయి వ్యక్తిని డమ్మీ చేయడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ఫోను చేసి సున్నితంగా హెచ్చరించడం ఆయన తీరుకు నిదర్శనం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంజనేయులు రవాణా కమిషనర్‌గా ఉన్నప్పుడే... కోడెల కుమారుడి ద్విచక్ర వాహనాల షోరూమ్‌పై గురిపెట్టారు. చిన్న చిన్న తప్పులను పట్టుకుని హింసించారు. అదే సమయంలో... ఆ షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నిచర్ ఉందని ప్రభుత్వానికి ఉప్పందించారు. తనపై ‘దొంగ’ అనే ముద్ర వేయడాన్ని బరించలేక కోడెల ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయారు. ఇక... జేసీ కుటుంబాన్నీ పీఎస్సార్ లక్ష్యంగా చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై కేసులు పెట్టారు. వారిని అరెస్టు చేయించి జగన్ మెప్పు పొందారు. ఆ తర్వాత ఆయనను ఏసీబీ చీఫ్‌గా, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. అక్కడా విపక్ష నేతలే లక్ష్యంగా విధులు నిర్వహించారు. అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. జగన్ విపక్షంలో ఉండగా ఆయనను గట్టిగా నిలువరించిన అచ్చెన్నాయుడును ఈఎ్‌సఐ మందుల కేసులో ఇరికించారు. అనారోగ్యానికి గురై, ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నను రాష్ట్రానికి ఆ చివర నుంచి గుంటూరు వరకు వాహనంలో తీసుకొచ్చారు. ‘సంగం’ డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై కేసు పెట్టి, అరెస్టు చేయించారు. ఇక... స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది కొల్లి రఘురామిరెడ్డి అయినప్పటికీ... మొత్తం స్కెచ్ ఆంజనేయులుదే అనేది బహిరంగ రహస్యం.
కాంతి రాణా కథేంటి..!
‘వైసీపీ నేతలకు కొమ్ముకాయడం... విపక్ష నాయకులను వేధించడం’... ఐదేళ్లుగా ఐపీఎస్ కాంతిరాణా తాతా ఎదుర్కొంటున్న ఆరోపణ ఇది! విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న ఆయన... ‘జగన్‌పై ఈగ వాలినా సహించలేను’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎస్ అధికారుల సంఘమంటే తానే అన్నట్లుగా ఖండనలు, ప్రకటనలు జారీ చేస్తుంటారు. ఇటీవల... ఈసీక ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా గులకరాయి కేసులోనూ వెనుకబడిన వర్గాల కు చెందిన అమాయక యువకులను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతపురం రేంజ్ డీఐజీగా ఉంటూ చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అనంతపురం నుంచి దొంగ ఓటర్లను తీసుకెళ్లే వాహనాలకు ‘రైట్ రైట్’ చెప్పింది ఆయనే అనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల సందర్భంగా కుప్పంలో వైసీపీ చేసిన అరాచకాలకూ ఆయన మద్దతు ఉందని చెబుతారు. తమిళనాడు నుంచి రప్పించిన దొంగ ఓటర్లతో స్థానికుల పేరుపై ఉన్న ఓట్లు వేయించినా పోలీసులు అడ్డుకోలేదు. వైవీ సుబ్బారెడ్డి ఆశీర్వాదంతో విజయవాడ సీపీగా పోస్టింగ్ తెచ్చుకున్నట్లు సమాచారం.