Share News

YS Jagan: అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్ కీలక కామెంట్స్..

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:49 AM

వైఎస్‌ అవినాశ్‌ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను. కాబట్టే టికెట్‌ ఇచ్చాను. మాఅందరి కన్నా చిన్నపిల్లాడు అవినాశ్‌

YS Jagan: అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్ కీలక కామెంట్స్..
YS Jagan

  • తప్పు చేయలేదని నమ్మా కాబట్టే టికెట్‌ ఇచ్చా: జగన్‌ఙ

  • అవినాశ్‌ జీవితం నాశనం చేయాలని కుట్ర

  • ఈ కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్లూ కలిశారు

  • వైఎస్‌ పేరు తుడపాలని చూసిన పార్టీలో చేరిక

  • వైఎస్‌ శత్రువు ఇంటికి పసుపుచీర కట్టుకెళ్లారు

  • వివేకాను చంపానన్న వ్యక్తికి మద్దతు

  • చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టపట్టాల్‌

  • వీళ్లా రాజశేఖరరెడ్డి వారసులు?

  • పులివెందుల సభలో షర్మిల, సునీతలపై

  • ముఖ్యమంత్రి జగన్‌ విమర్శలు

కడప, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘వైఎస్‌ అవినాశ్‌(YS Avinash) ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను. కాబట్టే టికెట్‌ ఇచ్చాను. మాఅందరి కన్నా చిన్నపిల్లాడు అవినాశ్‌. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని పెద్దపెద్దవాళ్లంతా కుట్రలు చేస్తున్నారు’’ అని సీఎం జగన్‌(CM YS Jagan) అన్నారు. పులివెందుల(Pulivendula) అసెంబ్లీకి నామినేషన్‌(Election Nomination) వేసేందుకు ఆయన గురువారం తాడేపల్లి నుంచి పులివెందుల వచ్చారు. ఈ సందర్భంగా పులివెందులలో నిర్వహించిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడారు. ‘‘జగన్‌ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పక్కనబెట్టాడని మాట్లాడుతున్న నా బంఽధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’’నంటూ వివేకా హత్యకేసును ప్రస్తావించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న అవినాశ్‌ను అమాయకుడని చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘వివేకా హత్య కేసు విషయంలో అవినాశ్‌ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని వీరంతా.. ఈ చిన్నపిల్లాడిని దూషించడం, తెరమరుగు చేయాలనుకోవడం దారుణం. వీరందరూ మనుషులేనా?’’ అని వ్యాఖ్యానించారు. వివేకా చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకూ తెలుసునన్నారు. ‘‘బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనకాల ఎవరున్నారో మీకు తెలుసు. చిన్నాన్నకు రెండోభార్య ఉన్నమాట వాస్తవమా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉందన్న మాట వాస్తవమా కాదా? (జగన్‌ ప్రశ్నించినప్పుడు జనంనుంచి ఎలాంటి స్పందనా లేదు) హత్య జరిగిన రోజున ఎవరో ఫోను చేస్తే అవినాశ్‌ అక్కడికి వెళ్లాడు. ఇదే విషయాన్ని అవినాశ్‌ తన ఇంటర్వ్యూలు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. ఆ సమాఽఽధానాలను బలపరుస్తూ మాట్లాడుతున్న వారినీ వీరంతా విమర్శిస్తున్నారు. ఇది ధర్మమేనా?’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. వివేకాను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఉంటాయా? అని విమర్శించారు. ‘‘గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని పార్టీలో (షర్మిల) చేరారు. వైఎస్‌ పేరును తుడిచేయాలని, కనపడకుండా చేయాలని చూసిన ఆ పార్టీ నాయకులకు ఓట్లు వేయడమంటే ఎవరికి లాభం? వైఎస్‌ శత్రువుల ఇంటికి పసుపు చీర (కుమారుడి పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్లిన సందర్భం) కట్టుకుని వెళ్లారు. వారి స్ర్కిప్ట్‌లను మక్కీకి మక్కీ చదివి వినిపిస్తూ, వారి కుట్రలో భాగమవుతున్నారు. వీళ్లా వైఎస్సార్‌ వారసులు?’’ అని విమర్శించారు.


28 నుంచి జగన్‌ ప్రచారం

ఈ నెల 28 నుంచి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారాన్ని చేపడతారు. ఈ సభలను తాడిపత్రి నుంచి ప్రారంభిస్తారు. రాయలసీమ, కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో 15 రోజుల పాటు... 45 సభలు నిర్వహించేందుకు ప్రణాళికలను ఆ పార్టీ సిద్ధం చేసింది. ఈ నెల 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులోనూ, 29న చోడవరం, పీ గన్నవరం, పొన్నూరులో సభలు నిర్వహిస్తారు. మిగిలిన సభలను, తేదీలను కూడా శుక్రవారం నాటికి వైసీపీ ఖరారు చేయనుంది.

For More Andhra Pradesh and Telugu News..

Updated Date - Apr 26 , 2024 | 07:01 AM