Eluru : డ్రైవర్ నిద్రమత్తుకు ముగ్గురు బలి
ABN , Publish Date - Jul 09 , 2024 | 05:04 AM
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
ఇద్దరు మహిళలు, బాలుడు మృతి
డ్రైవర్, మరో చిన్నారికి తీవ్రగాయాలు
ఏలూరు జిల్లాలో ఘటన
ద్వారకా తిరుమల, జూలై 8 : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉండగా డ్రైవర్, మరో చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. భీమడోలు సీఐ బీబీ రవికుమార్, స్థానికులు తెలిపిన వివరాలు...తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు మండలం రాజవోలుకు చెందిన రాచబత్తుని భాగ్యశ్రీ (27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నిమిత్తం ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు తన ఇద్దరు పిల్లలు నాగ షణ్ముఖ (4), నాగ నితిన్‌కుమార్ (3), భీమవరానికి చెందిన తన తల్లిదండ్రులైన బొమ్మా నారాయణరావు, బొమ్మా కమలాదేవి (55)తో కలసి వెళ్లారు. భాగ్యశ్రీ భర్త నాగార్జున హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ఎండీగా పనిచేస్తున్నారు.
భర్త నాగార్జున వద్దకు రెండు రోజుల క్రితం వెళ్లిన భాగ్యశ్రీ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి స్వగ్రామమైన రాజవోలుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో విజయవాడలో తండ్రి నారాయణరావు వ్యక్తిగత పనిమీద దిగిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు లక్ష్మీనగర్ వద్దకు చేరుకోగా....చెన్నై నుంచి కాకినాడకు మిషనరీ లోడుతో వెళ్తూ రోడ్డుపక్కన ఆపిఉన్న ఓ భారీ ట్రాలీ వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా ఢీకొంది. కారు ట్రాలీ కిందకు దూసుకుపోయి తుక్కుతుక్కయింది. ఈ ప్రమాదంలో భాగ్యశ్రీ, కమలాదేవి, నితిన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయా లైన కొవ్వూరు మండలం వాడపల్లికి డ్రైవర్ దివి దుర్గావంశీ, చిన్నారి నాగషణ్ముఖ ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. ఎస్‌ఐ జి.సతీష్ నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.