AP Politics: వైసీపీ అధిష్టానంపై బాలినేని సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:07 PM
వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. తానే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నానని అన్నారు. తనను పార్టీ పట్టించుకోకపోవడమే..
అమరావతి, ఆగష్టు 27: వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. తానే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నానని అన్నారు. తనను పార్టీ పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, వైసీపీకి దూరంగా ఉండటానికి గల కారణాలు, ఏ పార్టీలో చేరబోతున్నారనే పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీని వీడే ఛాన్స్?
వైసీపీని వీడుతున్నారా? అని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా.. పార్టీనే తనను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందడం లేదన్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెబుదామని ప్రయత్నించానని, కనీసం ఎవరూ వినే పరిస్థితిలో కూడా లేరన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేశానని.. అయినా ఎవరూ తన వైపు చూడటం లేదన్నారు. అందుకే ఎన్నికల తరువాత మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు శ్రీనివాస్ రెడ్డి.
జనసేనలోకి వెళ్తున్నారా?
కొందరు తనపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని ఖండించారు. తాను జనసేనలోకి వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారని.. బహుశా జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఇలా తనపై ఆరోపణలు చేస్తున్నారేమో అని బాలినేని వ్యాఖ్యానించారు. తనకు ప్రజల మద్ధతు ఉందని.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. పార్టీ తనను పట్టించుకున్నా.. పట్టించుకోకున్నా తనకు ప్రజలు ఉన్నారన్నారు. వారి కోసం తాను పోరాడుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అవినీతి ఆరోపణలపై స్పందించిన బాలినేని.. ప్రభుత్వం వారిదే ఉందని, నచ్చిన దర్యాప్తు సంస్థలతో తనపై విచారణ చేయించుకోవచ్చునని ఓపె ఆఫర్ ఇచ్చారు.