Share News

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:58 AM

కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్‌ అకౌంట్‌కే పరిమితం కాగా...

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

  • రాష్ట్ర బడ్జెట్‌లో సమతుల్యత

  • ‘సూపర్‌ సిక్స్‌’ అమలుకు నిధులు

  • అసాధారణ ‘ఆలస్యం’తో పూర్తిస్థాయి బడ్జెట్‌

  • రూ.2.94 లక్షల కోట్లతో పయ్యావుల పద్దు

  • ఆదాయం రూ.2.01 లక్షల కోట్లుగా అంచనా

  • అప్పులు రూ.93,253 కోట్లు తేవాల్సిందే

  • 30 వేల కోట్ల గ్రాంటు వస్తుందని లెక్కలు

  • బడ్జెట్‌లో ఆచితూచి అంకెల కూర్పు

  • ఆదాయం ఆధారంగా పరిమాణం కుదింపు

  • ఆర్థిక పునరుజ్జీవమే మా లక్ష్యం

  • వైసీపీ పాలనలో పతనం అంచుల్లోకి రాష్ట్రం

  • వనరుల దోపిడీ, నిధుల దుర్వినియోగంతో

  • అధోగతి.. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి

  • కేశవ్‌ పద్దు రూ.2,94,427 కోట్లు

మొత్తం బడ్జెట్‌ రూ.2,94,427.25 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2.34 లక్షల కోట్లు

మూలధన వ్యయం రూ.32,712 కోట్లు

ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు

జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 4.19శాతం

జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 2.12శాతం

‘‘వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో రాష్ట్ర ఆర్థిక రథం అగాథంలో కూరుకు పోయింది. చంద్రబాబు అనుభవంతో తిరిగి దానిని గాడిన పెడతాం. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవహారాలు దుర్వినియోగమయ్యాయి.

ఆర్థిక సూత్రాల ప్రకారం కాకుండా..

ఒక వ్యక్తి ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగించినదాని ఫలితమే ఇది. రాష్ట్రంలో ఇన్నాళ్లూ ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పతనం అంచున ఉన్న ఆర్థిక వ్యవస్థను దారికి తెచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం’’

- బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్‌ అకౌంట్‌కే పరిమితం కాగా... ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సోమవారం శాసనసభకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించారు. గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో బడ్జెట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ఆయన ఆమోదం పొందారు. అనంతరం అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్‌, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర... వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి... రెండింటికీ సమప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్‌ రూపొందించారు. ‘సూపర్‌ 6’ పథకాలకు నిధులు కేటాయించారు. పెన్షన్లు, దీపం 2.0, అన్న క్యాంటీన్లు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యం ఇచ్చారు.


రాష్ట్ర ఖాతాలోనే అమరావతి అప్పు...

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న అప్పును రాష్ట్ర బడ్జెట్లో అప్పుల ఖాతాలోనే చూపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అప్పు కింద రూ.3,000 కోట్లను అంచనా వేశారు. కేంద్రం నుంచి వచ్చే రుణాలు రూ.18,249 కోట్లు చూపించారు. ఇందులో రూ.3,000 కోట్లు అమరావతికి వచ్చే అప్పు! మిగిలినవి రహదారులు, విద్యా రంగానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలిచ్చే దీర్ఘకాలిక లోన్లు ఉన్నాయి. అప్పుల అసలు కోసం రూ.24,498.98 కోట్లు, వాటి వడ్డీల కోసం రూ.28,754.32 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. పబ్లిక్‌ డెట్‌ రూ.5,60,094.25 కోట్లు. ఇది జీఎ్‌సడీపీలో 34.14 శాతం. కార్పొరేషన్ల అప్పుల వివరాలు, వాటి వడ్డీల చెల్లింపుల వివరాలు బడ్జెట్లో చెప్పలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు రూ.1,54,797.11 కోట్లున్నాయి. ఇందులో విద్యుత్‌ రంగానికి సంబంధించినవి రూ.48,638.59 కోట్లు కాగా, మిగిలిన రంగాలు తెచ్చుకున్న గ్యారంటీ అప్పులు రూ.1,06,158.52 కోట్లున్నాయి.

అంకెల్లో జాగ్రత్త....

బడ్జెట్‌ తయారీలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ముఖ్యంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఆధారంగా బడ్జెట్‌ను నియంత్రించారు. ఆదాయానికి, ఖర్చుకు మధ్య వ్యత్యాసం తగ్గించడం కోసం వీలైనంత మేరకు బడ్జెట్‌ పరిమాణం కుదించినట్టు అర్థమవుతోంది. కేపిటల్‌ వ్యయం రూ.32,000 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు చెల్లించిన బిల్లుల ఆధారంగా చూస్తే... ఈ అంచనాలు చేరుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక కేపిటల్‌ వ్యయం రూ.18,000 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం దీన్ని రెండింతలకు పెంచడం గమనార్హం. అలాగే, కేంద్రం నుంచి రూ.30 వేల కోట్ల గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారు. గత ఏడాది రూ.34,500 కోట్లు వచ్చాయి. అయితే... 2014-15కి సంబంధించిన రెవెన్యూ లోటు గ్రాంటు రూ.10,500 కోట్లను కేంద్రం గత ఏడాది విడుదల చేయడంతో ఈ మొత్తం భారీగా పెరిగింది. ఈ ఏడాది అలాంటిది లేకుండానే... రూ.30,000 కోట్లుగా అంచనా వేయడం మంచి పరిణామమే!


అంత ఆదాయం సాధ్యమేనా?

రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వచ్చిన ఆదాయం రూ.68,000 కోట్లు మాత్రమే. మిగిలింది ఆరు నెలల లెక్కలే. దీంతో... 2 లక్షల కోట్ల ఆదాయం సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక... అప్పులు రూ.94 వేల కోట్లుగా చూపించారు. ఆదాయం అనుకున్నంత రాకపోతే... ఆ మేరకు అదనంగా అప్పులు తేవాల్సి ఉంటుంది.

ఎందుకింత ఆలస్యం...

పలు ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో... అసాధారణ రీతిలో నవంబరులో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెలువడ్డాయి. 12వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అప్పటికే అమలులో ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌... జూలై 31వ తేదీన ముగిసిపోయింది. సాధారణంగా కేంద్ర బడ్జెట్లోని కేటాయింపులు, ప్రాధాన్యాల ఆధారంగా రాష్ట్రాలు బడ్జెట్‌ రూపొందించుకుంటాయి. ఏపీ విషయానికొచ్చేసరికి అమరావతి, పోలవరం అత్యంత కీలకం. ఈ రెండు ప్రాజెక్టులను కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లపై స్పష్టత లేకుండా రాష్ట్ర బడ్జెట్‌ రూపొందించడం కష్టమని కూటమి సర్కారు భావించింది. పైగా జగన్‌ హయాంలో ఆర్థిక వ్యవస్థ భ్రష్టుపట్టింది. ఎక్కడి నుంచి ఎంత అప్పు తెచ్చారు, ఏ శాఖలో ఎన్ని పెండింగ్‌ బిల్లులున్నాయి, ఏ పథకం నిధులు ఏ పనులకు మళ్లించారు, ఖజానాకు రావాల్సిన పన్నులను ఏయే కార్పొరేషన్లకు మళ్లించారు, రాష్ట్ర ఆస్తులు ఎక్కడెక్కడ తాకట్టు పెట్టి, ఎన్ని అప్పులు తెచ్చారన్న స్పష్టత లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రయ్యే నాటికి ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టడానికి ఇవన్నీ ప్రతిబంధకాలుగా మారాయి. జూలై 31 తర్వాత మరో 4 నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు ప్రతిపాదన పంపి ఆర్డినెన్సు తెచ్చారు. ఈ నాలుగు నెలల సమయంలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై స్పష్టతకు వచ్చారు. కేంద్రంతో పలుమార్లు చర్చించి పోలవరం, అమరావతికి రావాల్సిన నిధులపై ఒక స్పష్టతకు వచ్చి, మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.


బడ్జెట్‌ సమగ్ర స్వరూపం (అంకెలు రూ. కోట్లలో)

bud.jpg

Updated Date - Nov 12 , 2024 | 04:58 AM