Share News

విద్యుత్‌శాఖకు మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రూ.2.80 లక్షల బకాయిలు

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:33 AM

అధికారం అండతో అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ తన ఇంటికి వినియోగించిన విద్యుత్‌ బకాయిలను నాలుగేళ్లుగా ఎగవేస్తూ అధికారులను సైతం తన అధికారంతో భయపెట్టారు. ఫలితంగా నాలుగేళ్లుగా విద్యుత్‌ బకాయిలు ఏకంగా రూ.2.80 లక్షలకు చేరింది.

 విద్యుత్‌శాఖకు మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రూ.2.80 లక్షల బకాయిలు

  • మొన్నటి వరకు అధికారం అండతో అధికారులకు బెదిరింపులు

  • నోటిసులిచ్చినా స్పందన శూన్యం

  • ప్రభుత్వం మారటంతో గడువు కోరిన వైనం

గుంటూరు, జూన్‌ 15: అధికారం అండతో అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ తన ఇంటికి వినియోగించిన విద్యుత్‌ బకాయిలను నాలుగేళ్లుగా ఎగవేస్తూ అధికారులను సైతం తన అధికారంతో భయపెట్టారు. ఫలితంగా నాలుగేళ్లుగా విద్యుత్‌ బకాయిలు ఏకంగా రూ.2.80 లక్షలకు చేరింది. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం నందిగం సురేష్‌ స్వగ్రామం. వాస్తవానికి వారి ఇంటికి తన తండ్రి పేరుతో సర్వీసు ఉంది. విద్యుత్‌ మీటర్‌కు నందిగం సురేష్‌ ఆధార్‌ కార్డులు లింక్‌ చేశారు.

వారి ఇంటికి నెలవారీగా వెయ్యి యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగం జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్‌శాఖ సీఆర్‌డీఏ సర్కిల్‌ మందడం సెక్షన్‌ పరిధిలోనున్న సురేష్‌ ఇంటికి బకాయిలకు సంబందించి పలుమార్లు అధికారులు నోటీసులు అందించినా స్పందన శూన్యం. సీఎం జగన్‌ రెడ్డి వెంటే నిత్యం సురేష్‌ ఉండటంతో పాటు అధికారం అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో విద్యుత్‌శాఖ అధికారులు కూడా మిన్నకుండిపోయారు. నాలుగేళ్లుగా ఎటువంటి చెల్లింపులు లేకపోవటంతో బకాయిలు ఏకంగా రూ.2.80 లక్షలకు చేరినట్లు అధికార వర్గా లు తెలిపాయి.

ప్రభుత్వం మారటంతో మరోసారి అధికారులు బకాయిలకు సంబంధించి మాజీ ఎంపీ ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. దీనిపై సీఆర్‌డీఏలోని అధికార వర్గాలను వివరణ కోరగా బకాయిల చెల్లింపులకు సంబంధించి మాజీ ఎంపీ కొన్ని రోజులు గడువు కోరినట్టు తెలిపాయి. కాగా.. అనేక మంది వైసీపీ నేతలు అధికారం అండదండలతో విద్యుత్‌శాఖకు పెద్దఎత్తున బకాయిలు పెట్టినట్టు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సీఆర్‌డీఏ, గుంటూరు సర్కిల్‌ పరిధిలోని కొందరు వైసీపీ నేతలు ఇంటికి, కార్యాలయాలకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లోర్‌ ఫ్లోర్‌కు వేర్వేరుగా విద్యుత్‌ సర్వీసులు తీసుకొన్నట్టు సమాచారం. తద్వారా విద్యుత్‌శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని ఆ శాఖ సిబ్బందే వాపోతున్నారు. ఈ తతంగమంతా కొందరు అధికారులకు తెలిసినప్పటికీ వారు మిన్నకుండిపోవటం గమనార్హం.

Updated Date - Jun 16 , 2024 | 08:15 AM