AP Politics: సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - Jan 11 , 2024 | 06:28 PM
సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో వైసీపీ ( YCP ) కి కేంద్ర ఎన్నికల కమిషన్ ( Central Election Commission ) భారీ షాక్ ఇచ్చింది. నిన్నటి వరకు టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఏపీ ప్రభుత్వం ( AP Govt ) భావించింది.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో వైసీపీ ( YCP ) కి కేంద్ర ఎన్నికల కమిషన్ ( Central Election Commission ) భారీ షాక్ ఇచ్చింది. నిన్నటి వరకు టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఏపీ ప్రభుత్వం ( AP Govt ) భావించింది. సచివాలయ సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. టీచర్లు బోధనేతర పనులను అప్పగించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులను సచివాలయ సిబ్బందితోనే ప్రభుత్వం సరి పెట్టింది. ఈ విషయంపై తెలుగుదేశం - జనసేన అధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి ఎన్నికల నిర్వహణను టీచర్లకే అప్పగించాలని టీడీపీ - జనసేన నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. కాగా..ఏపీలో నిన్నటితో కేంద్ర ఎన్నికల కమిషన్ ( Central Election Commission ) సమావేశం ముగిసింది.
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల విధులకు టీచర్లను తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ అధికారుల నియామకానికి టీచర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. విద్యాశాఖ పరిధిలోని టీచర్లు, బోధనేతర సిబ్బంది వివరాలను 34కాలమ్స్ ప్రొఫార్మాలో ఫిల్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు ఈనెల 12వ తేదీ లోపు ప్రొఫార్మా, సాప్ట్, హార్ట్ కాపీలను డీఈఓ కార్యాలయాలకు అందజేయాలని తక్షణ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో వైసీపీ అగ్ర నేతలు ప్రయత్నాలు ప్రారంభించడంతో ససేమీరా అని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకున్నాయని అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ నిలదీసింది.