Share News

AP Govt: ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 25 , 2024 | 06:49 PM

ఉచిత ఇసుక పాలసీ 2024లో సినరేజీ ఫీజు మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21 న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

AP Govt: ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ఉచిత ఇసుక పాలసీ 2024లో సినరేజీ ఫీజు మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు. ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21వ తేదీన జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి రుసుం చెల్లించకుండా ఇసుకను నిర్మాణ అవసరాలకు తీసుకు వెళ్లేలా ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ రంగంతో ఉపాధి ఆదాయం పెరుగుతున్నందున ఉచిత ఇసుక పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా సినరేజీ ఫీజు, మెరిట్ అన్ శాండ్ , డీఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.


దీనివల్ల స్థానికంగా ఇసుక లభ్యత రవాణా పెరుగుతుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేలా విజిలెన్స్‌నూ పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక లభ్యతను పెంచేలా ప్రస్తుత ఇసుక పాలసీలో మార్పులు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం సినరేజీ ఫీజు, డీఏంఎఫ్..మెరిట్ కింద మెట్రిక్ టన్ను ఇసుక 88 ఉండగా దాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుకపై ఉన్న పన్నులు, స్వయంగా ఇసుక తవ్వకం, తరలింపు ఇసుక లభ్యం కానీ జిల్లాలో స్టాక్ యార్డుల ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.. విజిలెన్స్ మానిటరింగ్‌పై విధివిధానాలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇసుక అక్రమంగా తరలి పోకుండా జీపీఎస్. చెక్ పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


ఉచిత ఇసుక పోర్టల్‌ ఆవిష్కరణ...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం (AP State)లో ఉచిత ఇసుక (Free sand) ఆన్‌లైన్ బుకింగ్ (Online Booking) విధానం అమలు చేస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఉచిత ఇసుక పోర్టల్‌ను (Portal) అవిష్కరించారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఇసుక రవాణా దారుల వరకు ఎలాంటి తప్పులు చెయ్యకుండా పోర్టల్ రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు. ఇసుక స్టాక్ ఎంత ఉంది... సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి.. అనే వివరాలతో పోర్టల్ రూపొందించారు.


2వేల చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ పరిధిలో... 2వేల చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవాలి. ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్, యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఉచిత ఇసుక విధానం నేపథ్యంలో ఇసుక కావాల్సినవారు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

కాగా..ఉచిత ఇసుక దారి మళ్లకుండా, ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరే ఇందులోని అధికారులను నియమిస్తారు. గనులశాఖ, పోలీస్, ఎక్సైజ్, నీటిపారుదల, భూగర్భజలవనరులు.. తదితర శాఖల అధికారులతో కూడిన బృందం విస్తృతంగా తనిఖీలు చేయనుంది.


మార్గదర్శకాలు జారీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.


ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే...

జగన్ ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జులైలో జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచనలు చేసింది.


49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు ఆదేశించింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Oct 25 , 2024 | 07:02 PM