Venkayya Naidu: అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..
ABN , Publish Date - Aug 10 , 2024 | 12:01 PM
ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
బాపట్ల: ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జాగర్లమూడిలో మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య.. చీరాల రైల్వేస్టేషన్‌లో ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. నిస్వార్థ సేవా మూర్తి మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి. దాతృత్వం, మానవత్వం, పాలన దక్షత, స్నేహ సౌరభం కలిగిన వ్యక్తి కుప్పుస్వామి. అన్నదానం కన్నా విద్యా దానం గొప్పదని చెప్పిన మహానీయుడు. అలాంటి వారి గురించి నేటి తరాలకు తెలియాలి. అమరావతిలో వారి చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు సైతం పల్లెల వైపు చూడని సమయంలో గ్రామాల అభివృద్ధికి వారు కృషి చేశారు.
రాజకీయ నాయకులకు సానుకూల దృక్పథం ఉండాలి. గత ప్రభుత్వంలో ఏపీ అసెంబ్లీలో బూతులు మాట్లాడారు. అలాంటి వారికి బూత్‌లో ఓట్లు వేయకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాగా వ్యవహరించాలి. రాజకీయాల్లో నేను ఒక్కటే మార్గం.. ఒక్కటే పార్టీలో ముందుకు సాగాను. పిల్లలందరూ అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలతో గడిపే విధంగా తల్లిదండ్రులు పోత్సహించాలి. అలా చేస్తేనే వారికి మన సంప్రదాయాలు, విలువలు తెలుస్తాయి. నా చిన్నతనంలోనే మా అమ్మ గేదె పొడిచి చనిపోయారు. అమ్మమ్మ, తాతయ్యల వద్దే లోకజ్ఞానం నేర్చుకున్నా. తాతతో కలిసి పొలం పనులకు వెళ్లేవాడిని. వ్యవసాయం మన సంస్కృతి, సంప్రదాయం అని తెలిసేలా పిల్లలను తీర్చిదిద్దాలి" అని అన్నారు.
ఈ వార్త కూడా చదవండి:
Vangalapudi Anitha: సైబర్ నేరాలు అరికట్టేందుకే సైబర్ సోల్జర్స్, కమాండోల వ్యవస్థ..