YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..
ABN , Publish Date - Nov 27 , 2024 | 08:10 PM
జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
విజయవాడ: అదానీ చాలా రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. భారత దేశంలో అతని అవినీతిని పట్టుకోలేక పోయారని చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలో ఉన్నాయని విమర్శలు చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ అవినీతిని బయట పెట్టాయని అన్నారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజభవన్‌లో ఇవాళ(బుధవారం) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి షర్మిల వినతిపత్రం అందజేశారు. అదానీ, జగన్‌ల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ. 1750 కోట్లు జగన్ లంచాలు తీసుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థల నిర్ధారణ చేసిన విషయాలను వివరించారు.అవినీతితో చేసిన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు.
‘‘ఆధారాలు, సాక్ష్యాలతో అక్కడ ఛార్జిషీట్‌కు సిద్ధం అయ్యారు. ఈ అవినీతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం విచారకరం. అదానీ పేరే ప్రస్తావించే సాహసం సీఎం చంద్రబాబు చేయడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జతకట్టి కూటమిలో ఉన్న చంద్రబాబు ఇక చర్యలు ఏమి తీసుకుంటారు. ఈ ఒప్పందాల వల్ల ప్రజలపై వేల కోట్ల భారం పడుతుంది. ఏ రాష్ట్రంలో లేని రేట్లు ఇచ్చేందుకు జగన్ ఒప్పందం చేసుకున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. చంద్రబాబు కూడా గతంలో అనేక ఉద్యమాలు చేశారు. మరి ఇప్పుడు ఈ ఒప్పందాలపై ఎందుకు యాక్షన్ తీసుకోరు. జగన్ అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు కనీసం అదానీ పేరు ఎందుకు ఎత్తడం లేదు. ఏపీలో జరిగిన ఒప్పందంపై చంద్రబాబు స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. పార్లమెంటులోఅదానీ అవినీతిపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది’’ అని షర్మిల స్పష్టం చేశారు.
విచారణ చేయాలి
‘‘జగన్ మన ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారు. రూ.9 వేల కోట్ల విలువ చేసే గంగవరం ప్రాజెక్టును రూ. 600 కోట్లకు కట్టపెట్టారు. మరి ఈ ప్రాజెక్టులో జగన్ ఎంత లంచాలు తీసుకున్నారు. వీటి మీద విచారణ చేసి చర్యలు తీసుకునే బాధ్యత చంద్రబాబుపై లేదా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపై విచారణ చేయాలి. కాంగ్రెస్ డిమాండ్ ప్రకారం జేపీసీ వేసి విచారణ చేయాలి. పార్లమెంటులో కాంగ్రెస్‌కు టీడీపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలి. అమెరికా దర్యాప్తు సంస్థలు ఆధారాలతో కేసు నమోదు చేశారు. పక్క రాష్ట్రంలో 1.90 ఉంటే.. మన రాష్ట్రం లో2.90 ఎందుకు. జగన్ ఈవిషయంపై ఎందుకు మాట్లాడరు. ఎవరినో పంపి ప్రకటన ఇస్తే తప్పు ఒప్పు అవుతుందా. జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేసి అవినీతి చేయలేదని చెప్పాలి కదా. ఆయన సేఫ్ జోన్ చూసుకుని కేసు నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. అదానీ మోదీ మనిషి కాబట్టే కూటమి నేతలు విచారణ చేయడం లేదు’’ అని వైఎస్ షర్మిల ఆరోపించారు.