YSRCP: ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం.. జనసేనలోకి కీలకనేత..
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:12 PM
ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది. అసలే వైసీపీ పరిస్థితి గాలిలో దీపం మాదిరిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు పార్టీకి అండదండగా ఉన్న నేత పార్టీ మారబోతున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

ప్రకాశం: ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది. అసలే వైసీపీ పరిస్థితి గాలిలో దీపం మాదిరిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు పార్టీకి అండదండగా ఉన్న నేత పార్టీ మారబోతున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వైసీపీలో ఉత్కంఠ ప్రారంభమైంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్ పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. వాస్తవానికి తనను కాదని పార్టీ జిల్లా పదవులు ఇతర నేతలకు అప్పగించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకున్నా.. ఎన్ని అవమానాలు జరిగినా పార్టీ వీడే ఆలోచన మాత్రం చేయలేదు.
కానీ ఇప్పుడు బాలినేనిలో ఓపిక నశించినట్టుంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీని బలోపేతం చేయాలని బాలినేనిని వైఎస్ జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలినేని.. తనకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ఉద్దేశ్యం లేదని ఖరాఖండీగా చెప్పేసినట్టు సమాచారం. ఈవీఎంల వ్యవహారంలో పార్టీ అధిష్టానం సహకరించలేదని జగన్ ఎదుట బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానం తనకు సహకరించడం లేదని బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలు అంశాల్లో జగన్, బాలినేని మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికలకు ముందు కొంతకాలం పాటు బాలినేని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో తిరిగి పార్టీకి దగ్గరయ్యారు. పార్టీకి అండగా నిలిచారు. ఎన్నికలైన తర్వాత కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఇప్పుడు జగనే స్వయంగా పిలిచి జిల్లా వ్యవహారాలు చూడాలని చెప్పినా కూడా కుదరదని తేల్చి చెప్పేశారట. అనంతరం బాలినేని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే బాలినేని.. జనసేన, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా జనసేన నేత నాగేంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపిన అనంతరం జనసేనలో బాలినేని చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.