అరకొర వసతులు.. అయినా ఫలితాల్లో టాపర్లు
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:37 PM
ఆ కళాశాలలో అరకొర వసతు లు న్నా.. అధ్యాపకల కొరత వేధిస్తున్నా.. విద్యార్థులు మాత్రం ఎని మిదేళ్లుగా జిల్లా టాపర్లుగా నిలుస్తున్నారు. కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే మరింత ప్రతిభ కనబరుస్తామని ఉర్దూ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వేధిస్తున్న అధ్యాపకులు, తరగతి గదుల కొరత
16 సంవత్సరాలుగా గెస్ట్ లెక్చరర్లతో విద్యాబోధన
అయినా.. ఎనిమిదేళ్లుగా ప్రతిభ చాటుతున్న విద్యార్థులు
ఉర్దూ జూనియర్ కళాశాల దుస్థితిపై తల్లిదండ్రుల ఆవేదన
ప్రొద్దుటూరు టౌన్, ఆగస్టు 30: ఆ కళాశాలలో అరకొర వసతు లు న్నా.. అధ్యాపకల కొరత వేధిస్తున్నా.. విద్యార్థులు మాత్రం ఎని మిదేళ్లుగా జిల్లా టాపర్లుగా నిలుస్తున్నారు. కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే మరింత ప్రతిభ కనబరుస్తామని ఉర్దూ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ముస్లిం మైనార్టీ నాయకుల వినతి మేరకు 2008లో వసంతపేటలోని 18వ వార్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఎంపీసీ, బైసీపీ, సీఈసీ గ్రూపులతో ఉర్దూ ఇంగ్లీషు మీడియంలో బోధన చేస్తున్నారు. ప్రొద్దుటూరుతో పాటు జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, రాజుపాళెం, చాపాడు, కమలాపురం, చిన్నచెప్పలి, వెలువలి, కానగూడూరు,ఖాదర్‌పల్లి వంటి దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు.
ప్రస్తుతం కళాశాలలో మొదటి సంవత్సరం 86 మంది,ద్వితీయ సంవత్సరంలో 96 మంది విద్యార్థులు ఉన్నారు. కళాశాలలో చదివిన విద్యార్థులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, చార్టెడ్ అకౌంట్లుగా ఉద్యోగాలు చేస్తుండడంతో కళాశాలలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే కళాశాలలో తరగతి గదులు, అధ్యాపకుల కొరతనుదృష్టిలో ఉంచుకుని కళాశాలలో చేరడానికి విద్యార్థులు కాస్త జంకుతున్నారు.
16 సంవత్సరాలుగా అరకొర వసతులతోనే....
కళాశాల ఏర్పాటై 16 సంవత్సరాలు అయినా.. తగిన వసతులు లేకపోయినా.. విద్యార్థులు విద్యపై ఆసక్తితో సర్దుకు పోతున్నారు. కళాశాలలో ఇప్పటికీ ప్రిన్సిపల్ పోస్టు ఒక్కటే రెగ్యులర్ కాగా.. అధ్యాపకులందరు గెస్ట్ లెక్చలర్లుగా పనిచేస్తున్నారు. బాటనీ, ఫిజిక్స్ బోధించడానికి అధ్యాపకులు లేరు. అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఎన్నిసార్లు అధికారులను కోరినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలంకానీ, ప్రయోగాలు చేసుకోవడానికి ల్యాబ్‌లు లేవు.
వేధిస్తున్న తరగతి గదుల సమస్య
కళాశాలలో తగినన్ని తరగతి గదులు లేకపోవడంతో వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. గదులు ఇరుకుగా ఉండడంతో పక్క గదిలో అధ్యాపకుని బోధనలు, విద్యార్థుల అల్లర్లు వినపడకుండా కిటికీలు వేసుకుని పాఠాలు వినాల్సిన పరిస్థితి. వసంతపేటకు వెళే ్ల ప్రధాన రోడ్డుకు ఆనుకుని కళాశాల ఉండడంతో ఆ రోడ్డున వెళ్లే వాహనాల శబ్ధ కాలుష్యంతో విద్యార్థులు బోధనపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గదిని స్వాధీనం చేసుకోవడంతో ఆరుబయట తరగతులు నిర్వహిస్తున్నారు.
జిల్లా టాపర్లుగా నిలుస్తున్న విద్యార్థులు
అధ్యాపకుల కొరతతో తగిన వసతులు లేకపోయినా పరీక్షా ఫలితాల్లో కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నారు. జిల్లాలో అయిదు ఉర్దూ జూనియర్ కళాశాలలు ఉండగా 8 సంవత్సరాలుగా కళాశాల విద్యార్థులు జిల్లా టాపర్లుగా నిలుస్తున్నారు. కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించి రెగ్యులర్ అధ్యాపకులు, ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.