Chandrababu: లాంఛనంగా ‘‘మహా స్వాప్నికుడు చంద్రబాబు’’ పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Feb 11 , 2024 | 05:51 PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేరిట విజయవాడలో ‘‘మహా స్వాప్నికుడు చంద్రబాబు’’ అనే పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ చేతులమీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది.

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేరిట విజయవాడలో ‘‘మహా స్వాప్నికుడు చంద్రబాబు’’ అనే పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ చేతులమీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయుడు పూల విక్రమ్ రచించగా.. ప్రవాసాంద్రుడు వెంకట్ కోడూరి ప్రచురించారు. ఈ సభలో తొండెపు దశరథ జనార్ధన్, నన్నపనేని రాజకుమారి, నెట్టెం రఘురాం, బాలకోటయ్య, షరీఫ్, గొట్టిముక్కల రఘు, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, అమరావతి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత విక్రమ్ పూల మాట్లాడుతూ.... గతంలో మూడు పుస్తకాలతో పాటు, ‘‘శత పురుషుడు సావనీర్’’అనే పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు.
చంద్రబాబుపై అబద్ధపు ప్రచారం చేశారు: విక్రమ్ పూల
1993లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సీరియల్‌గా రాసినట్లు చెప్పారు. 1997 నుంచి తెలుగుదేశం పక్ష పత్రికలో పని చేశానని అన్నారు. అప్పటి నుంచి చంద్రబాబును దగ్గర నుంచి చూస్తూ వచ్చానని విక్రమ్ పూల వివరించారు. ‘‘మహా స్వాప్నికుడు చంద్రబాబు’’ పుస్తకం ద్వారా ఆయన ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ రచన చేశానని తెలిపారు. సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు ఈ పుస్తకంలో ప్రస్తావించానని తెలిపారు. చంద్రబాబు గురించి అనేక అబద్దాలు ప్రచారం చేశారని.. ఆయన అనని మాటలను కూడా అన్నట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. ఏయే సందర్భాల్లో చంద్రబాబు ఏం చెప్పారు ... వాటిని ఎలా మార్చారో ఈ పుస్తకంలో వివరించానని అన్నారు. చంద్రబాబును కించపరిచే విధంగా కొంతమంది ధూషణలు కూడా చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్ల ఉమ్మడి ఏపీ, విభజన ఏపీకి జరిగిన ప్రయోజనాలను ఈ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. ఈ పుస్తకం గురించి అందరూ తెలుసుకోవాలని దీనిపై చర్చ జరగాలని విక్రమ్ పూల పేర్కొన్నారు.