Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంలో విచారణ
ABN , Publish Date - May 16 , 2024 | 11:30 AM
న్యూఢిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గత వారం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను ఏపీ ప్రభుత్వం కొనసాగించింది.
న్యూఢిల్లీ: ఏపీ (AP)లో అక్రమ ఇసుక (Illegal Sand) తవ్వకాలపై గురువారం సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గత వారం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను ఏపీ ప్రభుత్వం (AP Govt.) కొనసాగించింది. దీంతో సర్కార్ కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఆధారాలతో సహా ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ (Nagendra Kumar) సుప్రీం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఓకా (Justice Abhay Oka) నేతృత్వంలోని ధర్మాసనం ముందు మరికొద్ది సేపట్లో విచారణ జరగనుంది.
అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని గత వారం సుప్రీం ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా? లేదా? అన్నది తనిఖీ చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమని తమకు తెలుసునని ధర్మాసనం పేర్కొంది.
అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో ఈరోజు కోర్టులో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కాగా ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా సుప్రీంకోర్టుకు నివేదించినట్లు సమాచారం.
మరోవైపు ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదికకు భిన్నంగా 22 జిల్లాల కలెక్టర్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి నివేదికలు సమర్పించారు. ఫిబ్రవరి 11-14 తేదీల నడుమ తనిఖీలు నిర్వహించి కలెక్టర్లు పంపిన నివేదికలన్నీ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా ఉన్నాయని, వాస్తవాలను కప్పిపుచ్చేలా ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. అయితే ఆయా కలెక్టర్లు ఎన్జీటీకి సమర్పించిన నివేదికలు తాజాగా ఆంధ్రజ్యోతికి చేతికి చిక్కాయి. ఆ నివేదికలన్నీ ఒకే ఫార్మాట్‌లో ఉన్నాయి. పొల్లు పోకుండా, పదం మారకుండా నిర్దేశిత రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలే జరగలేదంటూ కలెక్టర్లంతా మూకుమ్మడి నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికలపై ఎన్జీటీ విస్మయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. నివేదికలన్నీ ఒకే ఫార్మాట్‌లో ఉన్నాయేమిటి? అంటూ ఏపీ సర్కారును, గనుల శాఖనూ ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఏ మాత్రం మాట రాకుండా, సర్కారు పెద్దలు కోరుకున్నట్లే కలెక్టర్లు పోటీపడి మరీ ఇచ్చిన నివేదికల సారాంశం మీకోసం...
మా దగ్గర రీచ్‌లే లేవు...
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎటపాక, కొయ్యగూడెంలోని రీచ్‌లను పరిశీలించారు. ఆ రెండిం ట్లో ఇసుక తవ్వకాలే జరగలేదని నిర్ధారించారు. అనకాపల్లి కలెక్టర్ తమ జిల్లాలో పెద్ద నదులు లేవని, ఇసుక రీచ్‌లే లేవన్నారు. అనంతపురంలో రాయదుర్గం మండ లం వేపరాళ్ల రీచ్ పరిధిలో తనిఖీలు చేశారు. ఇసుక తవ్వకాలే జరగడం లేదన్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం టంగుటూరులోని చెయ్యేరు నది ని కలెక్టర్ తనిఖీ చేశారు. గతంలోనూ, తాజాగా ఇసుక తవ్వకాలు జరిగిన ఆనవాళ్లే లేవని తేల్చారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెం రీచ్‌లో కలెక్ట ర్ ఫిబ్రవరి 14న తనిఖీ చేశారు. ఆ రీచ్‌లో గతంలో భారీ యంత్రాలతో మైనింగ్ చేసిన ఆనవాళ్లే లేవన్నా రు. కానీ, ఇదే బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై 32 ఆధారాలు ఎన్జీటీ వద్ద ఉన్నాయి. కేంద్ర జాయింట్ కమిటీ కూడా ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంది. చిత్తూరు కలెక్టర్ ఫిబ్రవరి 12న పూతలపట్టు మండలం, పావిల్‌తోట గ్రామంలోని బహుదా నదిని తనిఖీ చేశారు. భారీ యంత్రాల వినియోగం లేదని, అక్రమ తవ్వకాలు లేవని తేల్చారు. ఏలూరు జిల్లా పరిధిలో వేలే రుపాడు మండలం కుకునూరులోని గోదావరి నది పరిసరాలను కలెక్టర్ తనిఖీ చే శారు. ఐదు రీచ్‌ల్లో మైనింగ్ జరగడం లేదని నివేదించారు. ఇంతకు ముందు, ఇప్పుడు భారీ యత్రాలను ఉపయోగించలేదన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలోని కృష్ణానది పరిసరాలు, రీచ్‌ల ను కలెక్టర్ పరిశీలించి ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని నివేదించారు. నిజానికి గుంటూరు జిల్లాల్లోని రీచ్‌ల్లో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారని, రాత్రి, పగలు తేడాలేకుండా తరలిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. ఈ ఫొటోలు ఇటు ఎన్జీటీకి, అటు హైకోర్టు, సుప్రీం కోర్టుకు సమర్పించారు. కాకినాడ జిల్లాలో ఇసుక అక్రమతవ్వకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ, జిల్లాలో ఎక్కడా అక్రమ తవ్వకాలే లేవని కలెక్టర్ నివేదించారు.
కొనసీమలోనూ సేమ్ టూ సేమ్...
గోదావరి వశిష్ఠ ఎడమగట్టు, గోదావరి గౌతమి కుడిగట్టుపై రీచ్‌లు ఉన్నా అక్రమ తవ్వకాలు, భారీ యం త్రాల వినియోగం లేదని కలెక్టర్ నివేదించారు. ఇదే ఫార్మాట్‌లో కృష్ణా కలెక్టర్ నివేదిక ఉంది. తోట్లవల్లూరు మండలం నార్త్‌వల్లూరు రీచ్‌ను తనిఖీచేసి ఎలాంటి అక్రమ తవ్వకాలు లేవన్నారు. తమ వద్ద కొత్త ఇసుక రీచ్‌లు లేవంటూ ప్రకాశం, నంద్యాల కలె క్టర్లు నివేదించారు. అలాగే నెల్లూరు, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపు రం మన్యం, సత్యసాయి జిల్లాల నివేదికలున్నాయి. కా గా, మిగిలిన వారికి భిన్నంగా తూర్పుగోదావరి కలెక్టర్ ఫిబ్రవరి 2నే తనిఖీలు నిర్వహించారు. తమ వద్ద అంతా బాగా ఉందని నివేదించారు. అయితే, కలెక్టర్ జిల్లా పరిధిలో ఏ రీచ్‌లను తనిఖీ చేశారో చెప్పలేదు. శ్రీకాకుళం కలెక్టర్ గోపాలపెంటలోని వంశధార నదిలో ని రీచ్‌ను తనిఖీ చేశారు. ఇసుక తవ్వకాలు నిబంధన ల ప్రకారమే జరిగాయని, రైతులు ఎడ్లబండ్లు తీసుకొచ్చారని, వాటి ఆనవాళ్లు ఉన్నాయని నివేదించారు. అయితే, ఫోటోలను పరిశీలిస్తే, అక్కడ భారీ వాహనా లు తిరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా పరిధిలోని అరుణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల సమస్య తీవ్రంగా ఉంది. నాగులాపురం మండలంలోని బీకేవీడు గ్రామంలోని రీచ్‌ను, పిచ్చాటూరు మండలంలోని ఎస్‌ఎ్‌సబీ పేట రీచ్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇసుక తవ్వకాలు జరగడం లేదని నివేదించారు. కానీ, ఇదే నది పరిధిలో భారీ యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా నదీగర్భాన్ని తోడేస్తున్నారని ఫిర్యాదులున్నా యి. విజయనగరం, పశ్చిమగోదావరి కలెక్టర్లు ఒకే ఫార్మాట్‌లో నివేదికలు ఇచ్చారు. కడపలోని ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తిలో, వీఎన్‌పల్లి మండలం ఎర్రబెల్లిలో కలెక్టర్ తనిఖీలు చేసి తమ వద్ద అంతా బాగుందని నివేదిక ఇచ్చారు.