Share News

Pawan Kalyan: అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు

ABN , Publish Date - Aug 23 , 2024 | 12:54 PM

వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నారన్నారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు.. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేయాలని పవన్‌ పేర్కొన్నారు.

Pawan Kalyan: అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు

అమరావతి: వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నారన్నారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు.. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేయాలని పవన్‌ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధే కూటమి లక్ష్యమన్నారు. దేశభక్తి పంచాయతీల నుంచే రావాలన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి వెళ్లారన్నారు. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక అని పవన్ పేర్కొన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. పదవులు తనకు అలంకరణ కాదని.. బాధ్యత అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు అపార అనుభవం ఏపీకి అవసరమని పేర్కొన్నారు.


ఏపీని అప్పుల బారి నుంచి తప్పించి.. సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు సరికొత్త చట్టం తెస్తామన్నారు. ఐదేళ్లలో 20 గ్రామసభలు జరిగేలా చూస్తామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తామన్నారు. గ్రామాల్లో కళాశాలలు, క్రీడా మైదానాలు లేని దుస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వ భూములు ఉంటే నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమేనన్నారు. దాతలు ముందుకొస్తే తాను కూడా నిధులు తీసుకొచ్చి.. క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.


బాధ్యతల నుంచి తాము పారిపోబోమని.. నిరంతరం పని చేస్తామని పవన్ తెలిపారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని.. గుండెల నిండా నిబద్ధత ఉందన్నారు. చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని తాను చాలా సభల్లో చెప్పానన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబేనన్నారు. లక్షల మందికి ఒకటో తేదీనే పెన్షన్లు ఇవ్వగలిగారని చంద్రబాబును పవన్ ప్రశంసించారు. తన కంటే బాగా ఆలోచించగలిగేవాళ్ల వెంట నడిచేందుకు తానెప్పుడూ సంకోచించబోనన్నారు. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి ఎంతో నేర్చుకోవాలనే తపను తనకు ఉందన్నారు. ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

Pharma company explosion: ఊపిరి తీసిన ‘ఆవిరి’!

Delhi: కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

Updated Date - Aug 23 , 2024 | 01:07 PM