ఎస్.. బాస్..!
ABN , Publish Date - Mar 14 , 2024 | 02:15 AM
కొంతమంది పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొ త్తుతున్నారు. బహిరంగంగానే ఆ పార్టీకి సహకరించాలంటూ తాయిలాలతో సిద్ధమైపోయారు.

అధికారానికి పోలీసుల సలాం
స్పెషల్ బ్రాంచ్‌పైనా వైసీపీ నేతల స్వారీ
పెత్తనం చెలాయిస్తున్న కొంతమంది ఖాకీలు
అధికారపార్టీ నాయకుల మాదిరిగా వ్యవహారం
హోంగార్డులకు ఇళ్ల స్థలాలంటూ తాయిలం
ఒంగోలులో హోంగార్డులకు ఇళ్లస్థలాలు అంటూ హోంగార్డుల సంఘం మాజీ నేత ఏకంగా గ్రూపులలో మెసేజ్ పెట్టడం దుమారం రేపుతోంది. ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు రేషన్ కార్డు, ఆధార్, ఓటరు కార్డుతోపాటు నివేశన స్థలం కోసం దరఖాస్తు తీసుకొని రండి అంటూ ఆయన సమాచారం ఇవ్వడంతో ఎన్నికల వేళ ఇలా తాయిలాలు ఏమిటి అన్న చర్చ ప్రారంభమైంది.
అధికార పార్టీలో చేరకపోతే రౌడీషీటు తెరుస్తామని ఓ టీడీపీ నాయకుడిని ఇటీవల పొన్నలూరు ఎస్‌ఐ రాజేష్ బెదిరించిన విషయం వివాదాస్పదమైంది. దీనిపై కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఎన్నికల కమిషన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ జిల్లాలో పోలీసు శాఖ పరిస్థితి. కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల ప్రాపకం కోసం వారికి తొత్తుల్లా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ బాస్ నేర సమీక్ష సమావేశంలో ఇచ్చిన సూచనలను కూడా పెడచెవిన పెట్టడం చర్చనీయాంశమైంది. సినిమా పోలీసులం కాదు అంటూ అందరినీ ఎస్పీ హెచ్చరించినప్పటికీ కిందిస్థాయి అధికారుల వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు కన్పించకపోవడం వారి ధిక్కార పోకడను తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి అధికారులపై కన్నేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఒంగోలు(క్రైం), మార్చి 13 : కొంతమంది పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొ త్తుతున్నారు. బహిరంగంగానే ఆ పార్టీకి సహకరించాలంటూ తాయిలాలతో సిద్ధమైపోయారు. స్వయంగా గ్రూపులలో మెసేజ్‌లు పెట్టడంతోపాటు బెదిరింపులకు దిగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధుల సిఫార్సు లేకుండా కనీసం కానిస్టేబుల్ బదిలీ కూడా కావడం లేదు. అయితే ఇటీవల స్పెషల్ బ్రాంచ్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్ ఆకస్మిక బదిలీ పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. సిబ్బంది బదిలీ విషయంలో ఒంగోలులో కొంతమంది పోలీసులు (అధికారపార్టీ సానుభూతిపరులుగా ముద్రపడిన వారు) జట్టుకట్టి తమ కనుసన్నల్లో వ్యవహారాలు నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోలీసు శాఖలో ఎలాంటి పని కావాలన్నా వారి దగ్గరకు వెళ్లి ప్రసన్నంచేసుకుంటే చాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకు ఓ పోలీసు సంఘం మాజీ నేత కేంద్ర బిందువుగా వ్యహరిస్తున్నాడు. ఈ విషయం పోలీసువర్గాల్లో దుమారం రేపుతోంది. గత నెలరోజులుగా పోలీసు స్టేషన్లలో కేసుల దర్యాప్తు గాలికొదిలేసి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతుండటం కొందరు అధికారుల పనిగా మారింది. జిల్లాలో పరిస్థితి చూస్తే ఓ మాజీ మంత్రి, ఆయనకు ఇరుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులుగా ఉన్న మంత్రుల చుట్టూ కొందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పోలీసు అధికారులు స్టేషన్లు వదిలి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడంతోనే సరిపోతోంది. పైగా వారి అంతరంగిక సేవలోనూ తరిస్తున్నారు. ఇందుకు పొన్నలూరు ఎస్సై రాజేష్ వ్యవహారమే ఒక నిదర్శనం. అధికారపార్టీలో చేరకపోతే రౌడీషీటు తెరుస్తామని టీడీపీ నేతను ఆయన బెదిరించడం విమర్శలకు తావిచ్చింది.
స్పెషల్ బ్రాంచ్‌పై అధికార పార్టీ పెత్తనం
స్పెషల్ బ్రాంచ్ అంటే పోలీసు శాఖకు కళ్లు, చెవులు వంటిది. అలాంటి ఎస్‌బీలో పనిచేయాలన్నా కూడా ప్రజాప్రతినిధుల సిఫార్సు కావాల్సి వస్తోంది. ఎన్నికల సమయం ఆసన్నమైన వేళ తాలూకా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బదిలీ విషయంలో నేతల ఒత్తిళ్లకు తలొగ్గారన్న ప్రచారం జరుగుతోంది. తిరిగి అక్కడ మరొకరిని నియమించడం కోసం కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. అక్కడ పోస్టింగ్ విషయంలో అనేక మంది పోటీలో ఉన్నారు. నిబంధనల ప్రకారం స్పెషల్ బ్రాంచ్‌లో నియామకం జరగాలంటే వారికి ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఉండాలి. అలాంటి వారి జాబితాను సిద్ధంగా ఉంచుకొని అవకాశం ఉన్న సమయంలో పోస్టింగ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎన్ని అభియోగాలు ఉన్నా ప్రజాప్రతినిఽధుల సిఫార్సు ఉంటే ఎస్‌బీలో పోస్టింగ్ ఇవ్వడం పరిపాటైంది. దీంతో తాలూకాలో ఎస్‌బీ పోస్టింగ్‌కు డిమాండ్ పెరిగింది.
చక్రంతిప్పుతున్న కొంతమంది పోలీసులు
ఇద్దరు ముగ్గురు పోలీసులు జట్టుగా ఏర్పడి అధికారపార్టీ తరఫున ఒంగోలులో చక్రం తిప్పుతున్నారు. వారు ఏవిధులు నిర్వహిస్తున్నారు అనేది కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీసు శాఖలో బదిలీ వ్యవహారాలు చూడటంతోపాటుగా ఏఅధికారి ఎక్కడికి రావాలన్న విషయంపై కూడా వారు ప్రజాప్రతినిధులకు సలహాలు ఇవ్వడం చూస్తుంటే పోలీసు శాఖలో పనిచేస్తున్నారా? లేక అధికారపార్టీకి సేవ చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక కానిస్టేబుల్ బదిలీ విషయంలో ఎస్పీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ మనోడు కాదు అంటూ పట్టుబట్టి నిలిపివేయించిన ఉదంతాలు ఉన్నాయి. దీంతో పోలీసు శాఖలో పనిచేసే సిబ్బంది వారిని ప్రసన్నంచేసుకోక తప్పడం లేదు.
హోంగార్డులకు ఇళ్ల స్థలాలంటూ ఆశలు
ఎన్నికల వేళ రాజకీయ నాయకులు తాయిలాలు ఇవ్వడం పరిపాటి. అయి తే ఒంగోలులో హోంగార్డులకు ఇళ్లస్థలా లు అంటూ హోంగార్డుల సంఘం మాజీ నేత ఒకరు ఏకంగా గ్రూపులలో మెసేజ్ పెట్టడం దుమారం రేపుతోంది. ఆయన నేరుగా ఇలా చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖ పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఎన్నికల వేళ ఇలా ప్రకటనలు చేయడం ఏమిటన్న చర్చ ప్రారంభమైంది. హోంగార్డులకు నివేశన స్థలాలు ఇవ్వడం సబబే అయినప్పటికీ.. ఎన్నికల ముందు మాయ చేయడం, అదీ పోలీసు శాఖలో అనుబంధంగా పనిచేసే హోంగార్డులు కావడంతో విమర్శలకు తావిస్తోంది.