Prakasam Barrage: క్లిష్టంగా మారిన పడవల తొలగింపు ప్రక్రియ..
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:33 AM
నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్‌పై బరుబు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా..
విజయవాడ, సెప్టెంబర్ 15: వరదల కారణంగా కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ పడవలను తొలగించడం క్లిష్టంగా మారింది. ఇప్పటి వరకు దశలవారీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కొత్త ప్లాన్ వేసి ఆ పడవలను తొలగించాలని అబ్బులు టీమ్ ప్రయత్నిస్తోంది. ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గొల్లపూడి నుంచి ఆరు కార్గో పడవలను రప్పించి.. వాటిలో రెండింటిని పూర్తిగా నీటిలో నింపి పడవలకు లాక్ చేయనున్నారు.
నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటును పూర్తిగా కట్ చేయలేకపోతోంది డైవింగ్ టీమ్. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంద్రాల నుంచి పడవలోకి నీరు చేరుతోంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి.. భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇక్కడా చిక్కే ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలడం లేదు. దీంతో నయా ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు అబ్బులు టీమ్.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అటు కృష్ణా నది.. ఇటు బుడమేరు.. మరోవైపు మున్నేరు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఇక నీటి ప్రవాహ ధాటికి ఒడ్డున నిలిపిన భారీ పడవలు సైతం కొట్టుకొచ్చాయి. ఓ మూడు భారీ సైజు పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడ్డాయి. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ పడవలను తొలగించేందుకు ప్రభుత్వం అబ్బులు టీమ్‌ను ఏర్పాటు చేసింది. అబ్బులు టీమ్ ఈ పడవలను తొలగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.