Share News

Minister Anagani : రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సదస్సులు

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:13 AM

ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తామని, సమస్యల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు చేపడతామని రెవెన్యూ..

 Minister Anagani : రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సదస్సులు

  • రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తామని, సమస్యల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు చేపడతామని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ర్టేషన్‌ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘‘రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతోంది. గతంలో 6,688 గ్రామాల్లో రీసర్వే జరిగింది. అక్కడ జరిగిన తప్పులను సరిచేసేందుకు వీలుగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నాం. తాజాగా మరో 9వేల గ్రామాల్లో రీ సర్వేకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో సుమారు 2.8 లక్షల వినతులు వచ్చాయి. వాటిలో అధికశాతం రిజిస్ర్టేషన్‌, రెవెన్యూ అంశాలకు సంబంధించినవే. రీ సర్వేకు సంబంధించి ప్రతి అంశాన్నీ ప్రజల ముందు ఉంచుతాం’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్‌పీ సిసోడియా మాట్లాడుతూ.. రెవెన్యూపరమైన అంశాలు, భూములు వివాదాలకు సంబంధించి కోర్టు కేసుల్లో అధికారులు త్వరితగతిన స్పందించాలన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఆక్రమణలపై విచారణ చేయాలని కోరారు. మ్యుటేషన్‌ ప్రక్రియపై పునరాలోచన చేయాలని కోరారు. సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్‌లు పి.గణబాబు, వేపాడ చిరంజీవిరావుతో పాటు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు,రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.


  • రీ సర్వేలో వైసీపీ అక్రమాలు: మంత్రి అనగాని

భూముల రీ సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం అనేకచోట్ల అక్రమాలకు పాల్పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. రెవెన్యూ సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేసిన తప్పులు తాము చేయబోమని, ప్రజాభిప్రాయం మేరకు రీ సర్వే నిర్వహిస్తామన్నారు. 200 ఎకరాలకు ఒక టీమ్‌ను ఏర్పాటుచేసి రీ సర్వే చేయనున్నట్టు వివరించారు. ప్రతి పట్టాదారుడికి మూడుసార్లు అవకాశం కల్పిస్తామన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల మేర ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఇందులో పాత్రధారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 20న కృష్ణా జిల్లాలో నిర్వహించే జోనల్‌ రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు. జనవరి 6 నుంచి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 05:13 AM