Public Issues : కుప్పం సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబరు
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:23 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ స్వయంగా పూనుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, నాయకుల చుట్టూ తిరగకుండా సింగిల్‌విండో పరిష్కార వేదికగా కార్యాలయాలను తయారు చేస్తోంది.
చంద్రబాబు @96406 22226
జన నాయకుడు పోస్టర్‌ను ఆవిష్కరించిన భువనేశ్వరి
కుప్పం, డిసెంబరు 21: ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ స్వయంగా పూనుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, నాయకుల చుట్టూ తిరగకుండా సింగిల్‌విండో పరిష్కార వేదికగా కార్యాలయాలను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలిగా చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌ను ప్రారంభించారు. అందుకోసం 9640622226 నంబరును అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతానికి కుప్పం నియోజకవర్గం ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ‘జన నాయకుడు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పోస్టర్‌ను సీఎం సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇందు కోసం ఏర్పరచిన కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కౌంటర్లకు వెళ్లి దరఖాస్తులో ఫిర్యాదు, ఇతర వివరాలు రాసిఇస్తే అక్కడి సిబ్బంది పోర్టల్‌లో నమోదు చేస్తారు. ప్రజలు నేరుగా జన నాయకుడు పోర్టల్, యాప్‌లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు. అదీకాకపోతే టోల్‌ఫ్రీ నం.96406 22226కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. నిర్దేశిత గడువులోగా సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ అవకాశాన్ని కుప్పం ప్రజలు వినియోగించుకోవాలి. ఈ పోర్టల్‌ను త్వరలోనే రాష్ట్రమంతటా విస్తరిస్తారు’ అని భువనేశ్వరి అన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీఆర్ సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.