AP News: తెలుగు భాషకు అన్యాయం జరిగింది: పవన్
ABN , Publish Date - Aug 29 , 2024 | 08:46 PM
Telugu Language Day 2024: గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Telugu Language Day 2024: గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్.. తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. ప్రస్తుతం తెలుగు భాష పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిందన్నారు పవన్. తెలుగు భాష ఔనత్యాన్ని, దాని గొప్పతనాన్ని తగ్గిస్తూ వచ్చామన్నారు. మన భాషని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. గిడుగు వెంకట రామమూర్తి వర్తమాన యువతకు తెలియదని.. ఆయన మామూలు పోరాట యోధుడు కాదన్నారు. తెలుగుజాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని పేర్కొన్నారు. సవర భాష కోసం కొన్ని సంవత్సరాలు పాటు కృషిచేసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి అని కీర్తించారు.
తెలుగు భాష మాట్లాడే వారిని గౌరవించాలని పవన్ పిలుపునిచ్చారు. మాతృభాష బోధించేవారికి జీతభత్యాలు ఎక్కువ ఉండాలన్నారు. జీవో నెంబర్ 77ను తెలుగు పండిట్లు రద్దు చేయాలని కోరుకుంటున్నారని.. ఈ జివో వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇంగ్లీషు పదం లేకుండా తెలుగు మాట్లాడటం చాలా కష్టంగా ఉందన్నారు. మాతృభాషకు పెద్దపీట వేయకపోతే మనం తీవ్రంగా నష్టపోతామన్నారు. ఇంగ్లీషులో చదివితే తెలివితేటలు వస్తాయనుకునేది పొరపాటేనని.. సూర్యనారాయణ నిఘంటువు తిరిగి పునర్ ముద్రణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు.