AP Politics: ఎర్రన్నాయుడు లేని లోటును రామ్మోహన్ నాయుడు తీర్చారు: ఎమ్మెల్యే బండారు
ABN , Publish Date - Jun 09 , 2024 | 01:58 PM
విశాఖ: కేంద్రమంత్రులుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu), గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (MP Pemmasani Chandrasekhar).. ఢిల్లీలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో వారిపై టీడీపీ, జనసేన, భాజపా కూటమి నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విశాఖ: కేంద్రమంత్రులుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu), గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (MP Pemmasani Chandrasekhar).. ఢిల్లీలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో వారిపై టీడీపీ, జనసేన, భాజపా కూటమి నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కూటమిలో జోష్ నిండింది. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎంపీలు కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీ చేరుకున్నారు. మరో వైపు చంద్రబాబు సైతం ఢిల్లీకి బయలుదేరారు.
కేంద్ర మంత్రిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టనుండడంతో మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ(MLA Bandaru Satyanarayana) సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహకారంతో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు గతంలో కేంద్రమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యి తండ్రి లేని లోటును రామ్మోహన్ నాయుడు తీర్చారన్నారు. ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో అదేవిధంగా రామ్మోహన్ నాయుడు ఉపయోగపడతారని అన్నారు.
ప్రధాని మోడీకి రామ్మోహన్ నాయుడుపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని, అందుకే క్యాబినెట్ స్థాయి దక్కిందని బండారు సత్యనారాయణ అన్నారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. మూడోసారి ఎంపీగా ఎన్నికైన అతను తెలుగుజాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా ఉత్తరాంధ్రకే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకూ తన వంతు సేవలందిస్తారని చెప్పారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతారని, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆగిపోయిన రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకుపోనున్నట్లు బండారు సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.