Andhra Pradesh: దశాబ్ద ఘోషగా ఏపీ పరిస్థితి: ఉండవల్లి అరుణ్
ABN , Publish Date - Jun 02 , 2024 | 12:40 PM
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందన్నారు. తెలంగాణలో రాష్ట్రావిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని.. ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందన్నారు.
అమరావతి, జూన్ 02: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందన్నారు. తెలంగాణలో రాష్ట్రావిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని.. ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందన్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని.. అధికారంలోకి ఎవరు వచ్చినా ఏపీ విభజన సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సిన రూ. 1.42 లక్షల కోట్లలో 58 శాతం తెలంగాణ ఇవ్వలేదని ఉండవల్లి ఆరోపించారు.
ఏపీకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా? అని ఉండవల్లి ప్రశ్నించారు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక్కటేనని అన్నారు. గత పదేళ్లలో ఏపీకి ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఏపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ తరహాలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, ప్రతిపక్షాల మధయ చర్చ జరగాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కానీ, ఇక్కడ చర్చ కంటే ఎక్కువగా రచ్చ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉండవల్లి. రానున్న ప్రభుత్వంలోనైనా ఏపీ పరిస్థితి మారాలి ఉండవల్లి ఆకాంక్షించారు.