YCP: మాచర్ల నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు
ABN , Publish Date - Apr 06 , 2024 | 07:07 AM
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి. నయానో భయానో ప్రతి ఒక్కరినీ తమ పార్టీకి అనుకూలంగా పెట్టుకోవాలన్న తపనతో పాటు టీడీపీ నేతలను అణగదొక్కడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గంలో వైసీపీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు.
పల్నాడు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ (YSRCP) నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి. నయానో భయానో ప్రతి ఒక్కరినీ తమ పార్టీకి అనుకూలంగా పెట్టుకోవాలన్న తపనతో పాటు టీడీపీ నేతలను అణగదొక్కడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గంలో వైసీపీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. టీడీపీ సానుభూతిపరుల ఆటోతో పాటు ప్రత్యర్థులు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన మూడవత్ తులసి నాయక్, తల్లి కమలి బాయికి గాయాలయ్యాయి. టీడీపీకి అనుకూలం ప్రచారం చేస్తున్నారనే అక్కసుతోనే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మేమంటే మీకు భయం లేదా అంటూ వైసీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారని బాధితులు చెబుతున్నారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళలో సైతం మొన్నటికి మొన్న టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. వైసీపీకి చెందిన నాగేశ్వరరావు తాజాగా టీడీపీ (TDP)లో చేరాడు. దీంతో ఆగ్రహించిన వైసీపీ వర్గీయులు నాగేశ్వరరావుపై దాడి చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై సైతం రాళ్లు రువ్వారు. పార్టీ నుంచి వెళతారా? అంటూ దుర్భాషలాడారు. వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం తొలిసారేమీ కాదు. గతంలోనూ జరిగాయి. మూడు నెలలు క్రితం ఓట్లు తొలగింపు విషయంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి.. టీడీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసును వైసీపీ నమోదు చేయించింది. వైసీపీ నేతలు ఇలా మాటిమాటికీ రెచ్చిపోవడంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.