Share News

పోసానిపై ఫిర్యాదుల వెల్లువ

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:17 AM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

పోసానిపై ఫిర్యాదుల వెల్లువ

22 చోట్ల ఫిర్యాదులు.. 5 కేసులు అనంతపురంలో దిష్టిబొమ్మ దహనం శ్రీరెడ్డిపై 4 ఫిర్యాదులు.. 3 కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదులు చేశారు. వీటిలో ఐదుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను తెలుగు యువత, ఎస్సీ సెల్‌ నాయకులు దహనం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను అసభ్యకరంగా దూషించారంటూ నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని విజయవాడ భవానీపురం పోలీసులు తెలిపారు. కాగా, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, హోంమంత్రి వంగలపూడి అనిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆ వీడియోలను అప్‌లోడ్‌ చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై నాలుగు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా, మూడు కేసులు నమోదయ్యాయి.

గుంటూరు మేయర్‌పై చర్యలు తీసుకోండి

సీఎం. డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌ను అసభ్య పదజాలంతో దూషించిన గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు వెస్ట్‌ డీఎస్పీ జయరామ్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఎమ్మెల్యే యనమల దివ్య, ఎమ్మెల్సీ యనమల రామకృష్టుడుపై అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై తొండంగి గ్రామానికి చెందిన నాగం గంగబాబు, శృంగవృక్షం గ్రామానికి చెందిన అడపా సురే్‌షను తుని రూరల్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అలాగే గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సారిపల్లి వెంకటరమణను గొల్లప్రోలు పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 15 , 2024 | 03:17 AM