సీఏల కోసం ఏఐ సర్టిఫికెట్ కోర్సు
ABN , Publish Date - Jul 17 , 2024 | 05:33 AM
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కూడా కృత్రిమ మేధ (ఏఐ) బాట పట్టింది. తన సభ్యుల (సీఏ) కోసం ప్రత్యేక ఏఐ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించింది...
ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్ అగర్వాల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కూడా కృత్రిమ మేధ (ఏఐ) బాట పట్టింది. తన సభ్యుల (సీఏ) కోసం ప్రత్యేక ఏఐ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఐసీఏఐ నిర్వహిస్తున్న ఏఐ ఇన్నోవేటివ్ సదస్సు (ఏఐఎస్ 2024)కు హాజరైన ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రంజిత్ కుమార్ అగర్వాల్ విలేకరులతో ఈ విషయం చెప్పారు. అకౌంటింగ్, ఆడిటింగ్‌కు సంబంధించి ఒక జాతీయ సంస్థ ఏఐ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించడం ప్రపంచంలో ఇదే తొలిసారని తెలిపారు. ఈ కోర్సు ద్వారా ఐసీఏఐ సభ్యులకు అకౌంటింగ్, ఆడిటింగ్‌కు సంబంధించిన సమకాలీన ఏఐ టూల్స్‌పై అవగాహన ఏర్పడుతుందన్నారు.
ఏఐ ఆధారిత అకౌంటింగ్ టూల్స్ ఎన్ని అందుబాటులోకి వచ్చినా అవి సీఏలకు ప్రత్యామ్నాయం కావని అగర్వాల్ స్పష్టం చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం, కంపెనీల అకౌంటింగ్, ఆడిటింగ్‌లో జరిగే మోసాలను వెంటనే గుర్తించడం, నిబంధనల అమలు విషయంలో సీఏలకు సాయపడేందుకు త్వరలో ఒక ఆడిట్ టూల్‌ను తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపారు. ఐసీఏఐ సీఏ జీపీటీ టూల్ దేశంలో సీఏ కోర్సు చేసే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అగర్వాల్ చెప్పారు.