Share News

JNTU: జేఎన్‌టీయూకు వీసీ ఉన్నట్టా.. లేనట్టా..

ABN , Publish Date - Dec 06 , 2024 | 09:56 AM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జేఎన్‌టీయూ(JNTU)కు ఉపకులపతి ఉన్నట్టా, లేనట్టా.. అని ఇటు విద్యార్థులు, అటు ఆచార్యులు సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మే నెల 21న వైస్‌ చాన్స్‌లర్‌గా కట్టా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో.. 22నుంచి ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు.

JNTU: జేఎన్‌టీయూకు వీసీ ఉన్నట్టా.. లేనట్టా..

- టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా నియామకంతో ఖాళీగా వీసీ పోస్టు

- అంబేడ్కర్‌ వర్ధంతి సభ షెడ్యూల్‌లో వీసీ కోసం స్లాట్‌ పెట్టిన జేఎన్‌టీయూ అధికారులు

- వైస్‌ చాన్స్‌లర్‌ ఎవరు!

- విద్యార్థులు, ఆచార్యుల్లో అయోమయం

హైదరాబాద్‌ సిటీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జేఎన్‌టీయూ(JNTU)కు ఉపకులపతి ఉన్నట్టా, లేనట్టా.. అని ఇటు విద్యార్థులు, అటు ఆచార్యులు సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మే నెల 21న వైస్‌ చాన్స్‌లర్‌గా కట్టా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో.. 22నుంచి ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు. అయితే, నవంబరు 30న ఆయన్ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. జేఎన్‌టీయూకు ఇన్‌చార్జి వీసీగా ఆయన పదవీకాలం కూడా ముగిసినట్టయింది. గత వారం రోజులుగా ఇన్‌చార్జి కానీ, రెగ్యులర్‌గా కానీ ప్రభుత్వం ఎవరినీ నియమించక పోవడంతో వైస్‌చాన్స్‌లర్‌ పోస్టు ఖాళీగానే ఉంటోంది. ఫలితంగా యూనివర్సిటీలో అభివృద్ధి పనులు, అకడమిక్‌ అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు పెద్దదిక్కు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే, ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలిచిపోయాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు హ్యాష్‌ ఆయిల్‌..


డిప్యూటీ సీఎం షెడ్యూల్‌లో ‘వీసీ’కి స్లాట్‌!

జేఎన్‌టీయూలో శుక్రవారం అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కానున్నట్టు వర్సిటీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ మేరకు అంబేడ్కర్‌ వర్ధంతి సభ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. యూనివర్సిటీకి వీసీ పోస్టులో రెగ్యులర్‌ లేదా ఇన్‌చార్జిగా ప్రభుత్వం ఎవర్నీ నియమించక పోయినప్పటికీ, మీటింగ్‌ షెడ్యూల్‌లో మాత్రం వైస్‌చాన్స్‌లర్‌ ప్రసంగానికి (మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.30గంటల వరకు) స్లాట్‌ను పెట్టారు. తమ యూనివర్సిటీకి వీసీ ఎవరో ఎవరికీ తెలియకున్నా, ఆయన ప్రసంగానికి మాత్రం 15 నిమిషాలు కేటాయిస్తూ రిజిస్ట్రార్‌ పేరిట విడుదలైన సర్క్యులర్‌.. యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ మన యూనివర్సిటీకి వీసీ ఎవరబ్బా అంటూ అయోమయంగా ఒకర్ని మరొకరు ప్రశ్నించుకుంటున్నారు.


సమస్యలు పరిష్కరిస్తారా!

ఆర్నెల్లుగా వర్సిటీకి వైస్‌ చాన్స్‌లర్‌ లేకపోవడం, గత పదేళ్లుగా యూనివర్సిటీకి రావాల్సిన గ్రాంట్లు అందకపోవడం, వర్సిటీ అనుబంధంగా ఉన్న కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది కొరత.. తదితర అంశాలపై డిప్యూటీ సీఎంకు వినతిపత్రాలు ఇవ్వాలని విద్యార్థి సంఘాల, ఆధ్యాపక సంఘాల ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. డిప్యూటీ సీఎం రాకతోనైనా తమ యూనివర్సిటీకి సంబంధించి ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పనిలో పనిగా యూనివర్సిటీలో రూ. 50 కోట్లతో నిర్మించిన గోల్డెన్‌ జూబ్లీ భవనాన్ని కూడా డిప్యూటీసీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇన్‌చార్జి వీసీ పోస్టుకు పెరిగిన పోటీ

జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్‌ పోస్టుకు రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ప్రత్యేకత ఉంది. జాతీయ స్థాయిలో అతిపెద్ద సాంకేతిక విశ్వవిద్యాలయం కావడంతో ఈ యూనివర్సిటీ వీసీ పోస్టును అర్హత కలిగిన ప్రొఫెసర్లందరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి రాని విధంగా జేఎన్‌టీయూ వీసీ పోస్టుకు 100కు పైగా దరఖాస్తులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రొఫెసర్ల నుంచి రావడమే ఇందుకు నిదర్శనం.


అయితే.. అనివార్య కారణాలతో జేఎన్‌టీయూ వీసీ నియామకం ఆలస్యం కావడంతో ఇన్‌చార్జి వీసీ పోస్టుకోసం కూడా పోటీ నెలకొంది. నిన్నమొన్నటివరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇన్‌చార్జి వీసీగా ఉండగా, ప్రస్తుతం ఆయన పోస్టులో అదనపు బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారికి జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న డాక్టర్‌ బాలకిష్టారెడ్డి లేదా ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా ఉన్న ప్రొఫెసర్‌ కుమార్‌ కూడా ఇన్‌చార్జి వీసీగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


వర్సిటీ నుంచి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన కొందరు సీనియర్‌ ప్రొఫెసర్లు కూడా తాత్కాలిక వీసీగా అయినా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. జేఎన్‌టీయూ వీసీ నియామకంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, రెగ్యులర్‌ లేదా ఇన్‌చార్జి వీసీని తక్షణం నియమించి ఈ ఉత్కంఠకు తెరదించాలని విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2024 | 09:56 AM