Share News

India-Maldives Row: ఇండియా-మాల్దీవుల వివాదం.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా

ABN , Publish Date - Jan 09 , 2024 | 07:30 PM

ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ పర్యటన తర్వాత ప్రధాని మోదీ, భారతదేశంపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో..

India-Maldives Row: ఇండియా-మాల్దీవుల వివాదం.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా

India-Maldives Row: ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ పర్యటన తర్వాత ప్రధాని మోదీ, భారతదేశంపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో.. ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. మాల్దీవుల వివాదం అంశంలో.. భారత్‌పై విమర్శలు గుప్పించింది. దౌత్య సంబంధాల విషయంలో భారత్ ఓపెన్ మైండెడ్‌తో ఆలోచించాలని ఉచిత సలహా ఇచ్చింది.

‘‘చైనా ఎల్లప్పుడూ మాల్దీవులను సమాన భాగస్వామిగా పరిగణిస్తుంది. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుంది. అలాగే.. మాల్దీవులు, భారత్ మధ్య ఉన్న స్నేహపూర్వక, సహకార సంబంధాలను కూడా చైనా గౌరవిస్తుంది. భారత్‌తో మాల్దీవులకు సత్సంబంధాలు కొనసాగించడం ఎంతో ముఖ్యమో కూడా మాకు తెలుసు. భారత్, చైనా మధ్య విభేదాల కారణంగా.. న్యూఢిల్లీని తిరస్కరించమని బీజింగ్ ఏనాడూ మాల్దీవులను చెప్పలేదు. అలాగే.. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే సహకారాన్ని ఎన్నడూ ముప్పుగా భావించలేదు. దౌత్య సంబంధాల్లో భారత్ విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలి’’ అని చైనా పేర్కొన్నట్టు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అంతేకాదు.. చైనా, భారత్, మాల్దీవుల మధ్య త్రైపాక్షిక సహకారాన్ని నిర్వహించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చైనా చెప్పింది.


ఇదే సమయంలో.. భారత్, మాల్దీవుల మధ్య వివాగం కొనసాగుతున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ చైనా పర్యటనకు వెళ్లడాన్ని గ్లోబల్ టైమ్స్ తప్పుపట్టింది. ‘‘సాధారణంగా.. ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వచ్చినప్పుడు, ఆయా విషయాలు ప్రాముఖ్యత & ఆవశ్యకత ఆధారంగా వారి సందర్శనలను ఏర్పాటు చేస్తారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముయిజ్జూ భారత్‌ని సందర్శించడానికి బదులుగా తన మొదటి అధికారిక విదేశీ పర్యటన కోసం టర్కీని సందర్శించి, సంప్రదాయాన్ని ఉల్లంఘించారు’’ అని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. కాగా.. చైనా అనుకూల నాయకుడిగా పేరొందిన మహమ్మద్ ముయిజ్జూ మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

నిజానికి.. ముయిజ్జూ అధికారంలోకి రాకముందు భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కొన్ని అంశాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కూడా కొనసాగాయి. కానీ.. ముయిజ్జూ అధికారంలో వచ్చాక పరిస్థితులు తారుమారు అయ్యాయి. ముయిజ్జూ తన ప్రేమను చైనా మీదే కురిపిస్తూ.. ఆ దేశంతో సాన్నిహిత్యంగా మెలుగుతున్నారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మరి.. ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారో చూడాలి.

Updated Date - Jan 09 , 2024 | 07:30 PM