ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై దాడి
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:35 AM
హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.
రాకెట్లు, డ్రోన్లతో హడలెత్తించిన హెజ్‌బొల్లా మిలిటెంట్లు
నలుగురు ఇజ్రాయెల్ సైనికుల మృతి
టెల్ అవీవ్, అక్టోబరు 14: హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ హెర్జి హలెవి ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ దాడిలో ఆయన చనిపోలేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ డ్రోన్ దాడుల్లో తమ సైనికులు నలుగురు చనిపోయారని, 61 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఆ తర్వాత దాడి జరిగిన గోలాని బ్రిగేడ్ సైనిక శిక్షణా కేంద్రాన్ని హెర్జి హలెవి సందర్శించారు. గాయపడిన సైనికులను పరామర్శించారు. మరోవైపు హెజ్‌బొల్లా డ్రోన్ దాడిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థ గుర్తించలేకపోయింది. రాకెట్లతో పాటు డ్రోన్ల దండు రావడంతో గుర్తించలేకపోయినట్లు ఐడీఎఫ్ వర్గాల ద్వారా తెలిసింది.
ఇజ్రాయెల్‌కు అమెరికా ‘థాడ్’
బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్)ను ఇజ్రాయెల్‌కు అందించాలని అమెరికా నిర్ణయించింది. థాడ్ నిర్వహణ కోసం మూడువేల మంది అమెరికా సైనికులు ఇజ్రాయెల్‌కు రానున్నారు. దీంతో ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా సైన్యం ప్రత్యక్షంగా బరిలోకి దిగినట్లేనని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. అమెరికా నిర్ణయంపై ఇరాన్ భగ్గుమంది. తమ ప్రజలను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలకైనా ఉపక్రమిస్తామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అమెరికాను హెచ్చరించారు.
అమెరికా తాజా నిర్ణయంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 21 మంది చనిపోయారు. గాజాలోనూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. సెంట్రల్ గాజా డెయిర్ అల్ బలాహ్ ప్రాంతంలోని శరణార్ధులు తలదాచుకున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 20 మంది చనిపోయారు.