Modi-Putin: ఇదో వినాశకరమైన దెబ్బ.. మోదీ-పుతిన్ ఆలింగనంపై జెలెన్‌స్కీ ఫైర్
ABN , Publish Date - Jul 09 , 2024 | 02:13 PM
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ ప్రధాని వోలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ఆలింగనం చేసుకోవడంపై..
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రష్యా పర్యటనపై ఉక్రెయిన్ ప్రధాని వోలోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Vladimir Putin) మోదీ ఆలింగనం చేసుకోవడంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇది తమని తీవ్రంగా నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు ఓ నేరస్థుడ్ని కౌగిలించుకోవడం.. శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ అని అభివర్ణించారు. రష్యా క్షిపణి దాడి చేసిన రోజున జెలెన్‌స్కీ ఈ విమర్శ చేశారు.
జెలెన్‌స్కీ ట్వీట్
‘‘క్యాన్సర్ రోగులను లక్ష్యంగా చేసుకొని పిల్లల ఆసుపత్రిపై రష్యా చేసిన క్షిపణి దాడిలో 37 మంది దారుణంగా చనిపోయారు. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 170 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులోనూ 13 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి శిథిలాల కింద మరెందరో ఖననం చేయబడ్డారు. అలాంటి రోజున.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు, ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరస్థుడిని ఆలింగనం చేసుకోవడం.. తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇది శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ’’ అంటూ జెలెన్‌స్కీ తారాస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనిపై ఇటు భారత ప్రభుత్వం, అటు రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.
ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ
మరోవైపు.. పుతిన్‌తో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవని.. ఈ వివాదాన్ని ముగించడానికి చర్చలు, దౌత్యమే మార్గాలని పుతిన్‌కు మోదీ సూచించినట్లు తెలిసింది. కాగా.. మోదీ పర్యటన సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకుని.. 40 క్షిపణులను ప్రయోగించింది. ఈ భీకర దాడిలో అనేక అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ భవనాలతో పాటు ఆసుపత్రులు కూడా కూలిపోయాయి. ఇందుకు కౌంటర్ ఇచ్చే దిశగా ఉక్రెయిన్ అడుగులు వేస్తోందని సమాచారం.
మోదీ-జెలెన్‌స్కీ భేటీ
ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి.. ఆ ఇరు దేశాధినేతలతో ప్రధాని మోదీ పలుసార్లు ఫోన్‌లో సంభాషించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, యుద్ధంతో ఏమీ తేలదని సూచించారు. గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో జెలెన్‌స్కీని సైతం మోదీ కలిశారు. రష్యాతో వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని భారత్ ప్రోత్సాహిస్తూనే ఉందని ఆయనతో పునరుద్ఘాటించారు.
Read Latest International News and Telugu News