Share News

Post of President : ట్రంపా.. కమలా?

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:17 AM

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌ స్వింగ్‌ రాష్ట్రాలు-- విస్కాన్సిన్‌, నార్త్‌ కరోలినా, మిషిగాన్‌, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

Post of President : ట్రంపా.. కమలా?

  • అమెరికా ఎన్నికల్లో గట్టి పోటీ

  • ఇద్దరూ మ్యాజిక్‌ ఫిగర్‌కు దగ్గర్లో!

  • ప్రచారానికి మిగిలింది కొన్ని గంటలే

  • స్వింగ్‌ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు

  • అమ్మే స్ఫూర్తి.. క్రమశిక్షణ నేర్పారు..

  • మన సంస్కృతిని గౌరవించాలన్నారు

  • ప్రవాసులనుద్దేశించి హ్యారిస్‌ వ్యాసం

  • ఎవరు గెలిస్తే.. ప్రపంచానికేంటి?

  • ‘అంతర్జాతీయం’గా అమెరికా ముద్ర

  • నాటో విషయంలో ఇద్దరిదీ చెరోదారి

  • ట్రంప్‌ గెలిస్తే.. పన్నుల బాదుడు

  • కమల వస్తే అంతర్జాతీయ అజెండా

న్యూయార్క్‌, నవంబరు 3: అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌ స్వింగ్‌ రాష్ట్రాలు-- విస్కాన్సిన్‌, నార్త్‌ కరోలినా, మిషిగాన్‌, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. షెడ్యూళ్ల వారీగా సోమవారం వరకు ఆయా రాష్ట్రాలను చుట్టేసి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజానాడిని పట్టుకుంటూ అమెరికా ఎన్నికలను అంచనా వేస్తున్న 272టువిన్‌ డాట్‌ కామ్‌, రియల్‌క్లియర్‌పాలిటిక్స్‌ డాట్‌ కామ్‌ వంటి సంస్థలు ట్రెండ్స్‌ క్షణక్షణం మారుతున్నాయని పేర్కొంటున్నాయి. 272 మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇరువురు అభ్యర్థులు 50లోపు స్థానాల దూరంలో ఉన్నట్లు చెబుతున్నాయి. కమల 226, ట్రంప్‌ 219 స్థానాల్లో ముందంజలో ఉండగా.. మ్యాజిక్‌ ఫిగర్‌కు కమల 44, ట్రంప్‌ 51 సీట్ల దూరంలో ఉన్నట్లు చెబుతున్నాయి. దీంతో కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాలపై ఇరువురు అభ్యర్థులు దృష్టి సారించారు. మరోవైపు ‘ఎర్లీ పోలింగ్‌’ సదుపాయాన్ని 6.8 కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకున్నారు. ఎన్నికల రోజు ప్రతికూల వాతావరణం, క్యూలైన్ల సమస్యను పరిష్కరించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ముందెన్నడూ లేని విధంగా.. అమెరికా ఎన్నికలు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్నాయి.


1945 తర్వాత యావత్‌ ప్రపంచం ఎన్నడూ అమెరికా ఎన్నికలను ఇంత ఆసక్తిగా పట్టించుకోలేదు. అందుక్కారణం.. ట్రంప్‌, కమలల్లో ఎవరు గెలిస్తే.. ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంచనాలే..! ట్రంప్‌ తాను విజయం సాధిస్తే.. అంతర్జాతీయంగా అమెరికా పాత్రను పూర్తిగా మార్చేస్తానని ప్రకటించారు. కమలా హ్యారిస్‌ అంతర్జాతీయ అజెండాను మరింతగా పెంచుతానని పేర్కొన్నారు. నాటో విషయంలోనూ వీరి అజెండా చెరోదారిగా ఉంది. కమల గెలిస్తే.. నాటోలో అమెరికా పెద్దన్న పాత్ర కొనసాగనుండగా.. ట్రంప్‌ సభ్యదేశాలపై భారాన్ని పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. నాటోలోని ఇతర 31 సభ్యదేశాల మిలిటరీ బడ్జెట్‌ మొత్తంలో 2/3 వంతును అమెరికా తమ దేశ రక్షణ రంగంపై వెచ్చిస్తోంది. ట్రంప్‌ గెలిస్తే సభ్య దేశాలు తమ జీడీపీలో 2% నిధులను నాటోపై వెచ్చించేలా ఒత్తిడి తీసుకువస్తానని ప్రకటించారు. 2024 నాటికి నాటోలోని 23 దేశాలు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించాయి.


  • ట్రంప్‌తో ‘పన్ను’పోటే?

ట్రంప్‌ గెలిస్తే.. చైనా నుంచి జరిగే దిగుమతులపై 60-200ు వరకు పన్ను(టారిఫ్‌) విధించే అవకాశాలున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులపై 20ు పన్ను(యూనివర్సల్‌ టారి్‌ఫ)ను అమలు చేస్తారని తెలుస్తోంది. ఇలాంటి చర్యలు వాణిజ్య యుద్ధాలు, ప్రతీకార చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుదుపులు తప్పవని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు. తద్వారా జీరో కార్బన్‌ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రపంచం చేస్తున్న ప్రయత్నాలకు గండిపడే ప్రమాదముంది. జోబైడెన్‌ ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు అమలు చేసిన విధానాలను ట్రంప్‌ రద్దు చేసే ప్రమాదం ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • యుద్ధం-శాంతి

పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అమెరికా, నాటో చర్యలు తీసుకోగా.. ట్రంప్‌ హయాంలో సేనల ఉపసంహరణ జరిగింది. ఫలితంగా అఫ్ఘానిస్థాన్‌ తిరిగి తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో కమల, ట్రంప్‌లది భిన్నస్వరం. బైడెన్‌ సర్కారు మాదిరిగా కమల కూడా నాటో ద్వారా మిలటరీపరంగా, ఆర్థికంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలుండగా.. ట్రంప్‌ బేషరతుగా రష్యాతో ఒప్పందం కుదుర్చుకునేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెస్తానని చెప్పారు. ఇజ్రాయెల్‌ విషయంలో మాత్రం ఇరువురి ఆలోచనలు దాదాపు ఒకేలా ఉన్నాయి. తైవాన్‌ విషయంలోనూ.. చైనా దాడి చేయకుండా చూస్తున్నందుకు తమకు డబ్బులివ్వాలని ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్‌ అధికారంలోకి వస్తే.. అమెరికాలో ఉన్న వలసదారులకు ఇబ్బందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


  • ట్రంప్‌ అయితే చంపడు!

అమెరికాలో పతాకస్థాయికి చేరుకున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన ఈలన్‌ మస్క్‌.. ప్రస్తుత బైడెన్‌ పరిపాలనను, అధికార యంత్రాంగాన్ని దుయ్యబట్టే ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదు. తాజాగా ఆయన ‘పీనట్‌’ అనే ఉడతను న్యూయార్క్‌ రాష్ట్ర అధికారులు యుథనేషియా(కారుణ్యమరణం) చేయడంపై మండిపడ్డారు. ‘‘ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ ఉడతలను పరిరక్షిస్తారు’’ అని ట్వీట్‌ చేశారు. ‘రిప్‌ (రెస్ట్‌ ఇన్‌ పీస్‌) పీనట్‌’ అంటూ ఏడుపు ముఖం ఎమోజీని కూడా ఆ ట్వీట్‌కు జత చేశారు. ఇంతకీ ఆ ఉడత కథ ఏమిటంటే.. ఏడేళ్ల క్రితం పీనట్‌(ఉడత) తల్లి రోడ్డు దాటుతూ ఒక కారు కింద పడి చనిపోయింది. పీనట్‌ను మార్క్‌ లాంగో అనే వ్యక్తి తెచ్చి పెంచుకున్నాడు. ఆ ఉడతతో రకరకాల విన్యాసాలు చేయించి సోషల్‌ మీడియాలో పెట్టేవాడు. దీంతో అది బాగా పాపులర్‌ అయిపోయింది. అయితే, అక్టోబరు 30న న్యూయార్క్‌లోని పర్యావరణ పరిరక్షణ విభాగం (డీఈసీ) అధికారులు లాంగోఇంటిపై దాడి చేసి, సోదాలు చేసి పీనట్‌ను, ఫ్రెడ్‌ అనే రకూన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటివల్ల మనుషులకు రేబిస్‌ వచ్చే ప్రమాదం ఉందంటూ తీసుకెళ్లి చంపేశారు! అధికారుల తీరును ఖండిస్తూ మస్క్‌తోపాటు వేలాదిమంది సోషల్‌ మీడియాలో బైడెన్‌ యంత్రాంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

Untitled-2 copy.jpg


  • భారత్‌తో అనుబంధంపై కమల వ్యాసం

భారతీయ-అమెరికన్‌ ఓటర్లలో 32% ట్రంప్‌వైపు మొగ్గుచూపారని సర్వేలు వెలువడడంతో.. కమల నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తన తల్లి శ్యామల హ్యారి్‌సను స్మరించుకుంటూ.. దక్షిణాసియా పత్రిక జాగర్నాట్‌లో సుదీర్ఘ వ్యాసం రాశారు. ‘‘నా తల్లి శ్యామల హ్యారిస్‌ 19 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చారు. ఆమె రెండు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగారు. వాటిల్లో ఒకటి రొమ్ము క్యాన్సర్‌ను నివారించడం. రెండోది నన్ను, నా సోదరి మాయను క్రమశిక్షణతో పెంచడం. మాకు భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని గౌరవించాలని బోధించేవారు’’ అని ఆ వ్యాసంలో చెప్పుకొచ్చారు. రెండేళ్లకోసారి దీపావళి పండుగను జరుపుకొనేందుకు తమిళనాడుకు వస్తామని పేర్కొన్నారు. ‘‘నాకు గుర్తుంది. మా తాతగారు పీవీ గోపాలన్‌ రిటైర్‌ అయ్యాక.. రోజూ బీచ్‌లో వాహ్యాళికి వెళ్లేవారు. నా చిన్నప్పుడు నేనూ ఆయనతో నడిచేదాన్ని. ఆ సమయంలో ఆయన తన సహచరులతో ప్రజాస్వామ్యం, విలువల గురించి మాట్లాడేవారు’’ అని వివరించారు.

Untitled-1 copy.jpg

Updated Date - Nov 04 , 2024 | 04:23 AM