Share News

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:47 AM

కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

  • కేంద్ర మంత్రివర్గంలో పదవులు!?..

  • టీడీపీకి 3, బీజేపీకి 3, జనసేనకు 1

    • రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, బాలశౌరి, పురందేశ్వరి, ఈటల, బండి లేదా డీకే అరుణకు చాన్స్‌

    • కిషన్‌రెడ్డికి పదవిపై సందిగ్ధత.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం?

    • మంత్రివర్గంపై అర్ధరాత్రి దాకా మోదీ కసరత్తు

    • మిత్రపక్షాలకు ఇచ్చే పదవులపై స్పష్టత!

    • కీలక శాఖలు బీజేపీ వద్దే

    • మిత్రపక్షాలకు రైల్వే, విద్య, ఐటీ, జలశక్తి..

    • నేటి ఉదయం రాష్ట్రపతి భవన్‌కు జాబితా

    • రాత్రి 7.15 గంటలకు మోదీ ప్రమాణం

న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి బాలశౌరికి, బీజేపీ నుంచి పురందేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం.

తెలంగాణ నుంచి ఈసారి కిషన్‌ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు చెందిన ఇతర నేతల్లో ఈటల రాజేందర్‌, డీకే అరుణ, బండి సంజయ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, బండి సంజయ్‌, డీకే అరుణల్లో ఒకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చునని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద ఏపీ, తెలంగాణలకు ఆరు నుంచి ఏడు మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది.

మూడవసారి ప్రధాని పదవిని చేపట్టటానికి సిద్ధమవుతున్న మోదీ తన నూతన మంత్రివర్గం కూర్పుపై కసరత్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకూ కసరత్తు కొనసాగినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు కేటాయించాల్సిన మంత్రిపదవులు, శాఖలపై మోదీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారని, బీజేపీలో ఎవరెవరికి ఇవ్వాలనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు మోదీ, ఆయనతోపాటు కొందరు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. మోదీతోపాటు దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.


మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్ల జాబితాను ఆదివారం ఉదయమే రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారని, ఈ మేరకు ఆయా నేతలకు ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం అందిస్తుందని తెలిసింది. ఇప్పటి వరకూ పూర్తిగా సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన మోదీ.. తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించాల్సి రావడం వల్ల మంత్రివర్గ కూర్పులో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే హోం, ఆర్థికం, వాణిజ్యం, పరిశ్రమలు, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, పెట్రోలియం, రోడ్డు రవాణా, న్యాయ మొదలైన మంత్రిత్వ శాఖలను బీజేపీయే తీసుకోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే, విద్య, ఐటీ, జలశక్తి, విద్యుత్‌, గనులు, వ్యవసాయం తదితర మంత్రిత్వ శాఖల్లో క్యాబినెట్‌ మంత్రి పదవులుగానీ, సహాయమంత్రి పదవులనుగానీ మిత్రపక్షాలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్డీయే మిత్రపక్షాల నుంచి

కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన కుమార స్వామి (జేడీఎస్‌), చిరాగ్‌ పశ్వాన్‌ (లోక్‌ జనశ క్తి), ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్సీపీ), లలన్‌ సింగ్‌, ఇటీవల భారతరత్న పురస్కారం పొందిన దివంగత నేత కర్పూరీ ఠాకూర్‌ తనయుడు రాంనాథ్‌ ఠాకూర్‌, సంజయ్‌ కుమార్‌ ఝా (జేడీయూ), జితన్‌ రాం మాఝీ (హెచ్‌ఏఎం), అనుప్రియ పటేల్‌ (అప్నాదళ్‌), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్డీ), శ్రీరంగ్‌ బర్నే, ప్రతాప్‌ రావు జాదవ్‌ (శివసేన)లకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ నుంచి..

బీజేపీ నుంచి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, జ్యోతిరాదిత్య సింధియా, బసవరాజ్‌ బొమ్మై, ప్రహ్లాద్‌ జోషి, జితిన్‌ ప్రసాద, రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, గజేంద్ర సింగ్‌ షెఖావత్‌, సురేశ్‌ గోపి, జితేంద్రసింగ్‌, సర్బానంద సోన్వాల్‌, దుష్యంత్‌ సింగ్‌, శంతను థాకూర్‌, జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ, బాన్సురీ స్వరాజ్‌, పురందేశ్వరి, సంజయ్‌ జైస్వాల్‌ తదితరులు ఉండే అవకాశాలున్నాయి.

Updated Date - Jun 09 , 2024 | 08:31 AM